నిందలతో సరి.. నిధుల్లేవు మరి! | - | Sakshi
Sakshi News home page

నిందలతో సరి.. నిధుల్లేవు మరి!

Published Sat, Sep 21 2024 2:58 AM | Last Updated on Sat, Sep 21 2024 1:20 PM

-

మొక్కుబడిగా సీఎం చంద్రబాబు జిల్లా పర్యటన

అధికారంలోకి వచ్చాక తొలిసారిగా జిల్లాకు..

సీఎం సుదీర్ఘ ప్రసంగంలో ప్రతిపక్షంపై విమర్శలకే అధిక సమయం

జిల్లాలో అభివృద్ధి పనుల ప్రస్తానవ లేకపోవడంపై జనం నిట్టూర్పు

వంద రోజుల్లో ఏమి చేశారో.. ఇకపై ఏమి చేస్తారో చెప్పని వైనం

ఇదెలా మంచి ప్రభుత్వం అవుతుందంటూ పెదవి విరుస్తున్న ప్రజలు
 

సాక్షి ప్రతినిధి ఒంగోలు/చీమకుర్తి: ‘‘సింగడు అద్దంకి పోనూపోయాడు.. రానూ వచ్చాడు’’ అన్న తీరుగా సాగింది ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి పర్యటన. అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా జిల్లా పర్యటనకు వచ్చిన చంద్రబాబు తన ప్రసంగంలో ఎక్కడా జిల్లా అభివృద్ధికి నిధుల మంజూరుపై నోరు విప్పలేదు. ఎన్నికల సమయంలో జిల్లా వాసులకు పెద్ద ఎత్తున హామీలిచ్చిన చంద్రబాబు మాటమాత్రమైన వాటిని ప్రస్తావించకపోవడం అన్ని వర్గాల వారిని నిరుత్సాహానికి గురిచేసింది.

‘ఇది మంచి ప్రభుత్వం’ పేరుతో చేపట్టిన కార్యక్రమంలో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు శుక్రవారం సంతనూతలపాడు నియోజకవర్గం నాగులుప్పలపాడు మండలంలోని మద్దిరాలపాడు గ్రామానికి వచ్చారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో చంద్రబాబు ప్రసంగించారు. తన ప్రసంగంలో గుండ్లకమ్మ మినహా మిగతా అంశాలను ప్రస్తావించలేదు. వంద రోజుల పాలనలో ఏమి చేశారో చెప్పకుండా, రాబోయే రోజుల్లో ఏమి చేస్తారో ప్రకటించకుండా.. కేవలం ప్రతిపక్ష వైఎస్సార్‌ సీపీపై దుమ్మెత్తిపోయడానికే ఆయన ఎక్కువ సయమం కేటాయించారు.

గంటన్నర ఆలస్యంగా..
ముందుగా నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారం సీఎం చంద్రబాబు నాయుడు శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటలకు రావాల్సి ఉంది. అయితే జనాలు రాకపోవడంతో చంద్రబాబు గంటన్నర ఆలస్యంగా సభా స్థలికి వచ్చారు. మధ్యాహ్నం 3.30 గంటలకు చదవాలడ సమీపంలో ఓ ప్రైవేట్‌ విల్లా ఆవరణలో ఉన్న హెలిప్యాడ్‌ వద్ద దిగారు. అక్కడ నుంచి రోడ్డు మార్గాన మద్దిరాలపాడు గ్రామానికి చేరుకున్నారు. 

ముందుగా ఆయన గత ప్రభుత్వం ఇల్లు మంజూరు చేసిన లబ్ధిదారుడు పఠాన్‌ నూర్జహాన్‌ ఇంటికి వెళ్లారు. అక్కడ నుంచి టీడీపీ సానుభూతిపరుడు ఆళ్లదాసు శ్రీను ఇంటికి వెళ్లారు. తర్వలో ప్రభుత్వం కేటాయించబోయే మద్యం దుకాణాన్ని కల్లుగీత కార్మికుని కోటాలో ఇస్తానని హామీ ఇచ్చారు. అనంతరం టీడీపీ సానుభూతిపరుడు జగ్గయ్య ఇంటికి వెళ్లి మాట్లాడారు. టీడీపీ సామాజికవర్గం ఎక్కువగా నివాసముంటున్న ఆంజనేయస్వామి విగ్రహం సమీపంలో చిన్నిపాటి వేదిక ఏర్పాటు చేశారు. రెండు వందల మంది పట్టే స్థలంలో చంద్రబాబు సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎస్సీ కాలనీ వాసులను దూరంగా ఉంచడం గమనార్హం.

గంట ప్రసంగం.. ప్రతిపక్షంపై విమర్శల దండకం
బహిరంగ సభలో సీఎం చంద్రబాబు తనకు అలవాటైన రీతిలో సుదీర్ఘంగా గంటపాటు ప్రసంగించారు. అందులో ఎక్కువ సమయం గత ప్రభుత్వం, ప్రతిపక్ష పార్టీపై విమర్శలకే కేటాయించారు. మద్దిరాలపాడు గ్రామ సభలో వంద రోజుల్లో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి చెబుతారని అందరూ భావించారు. ‘అధికారంలోకి వచ్చిన తర్వాత 7 శ్వేతపత్రాలు విడుదల చేశాం. పింఛన్లు ఇచ్చాం’ అనే విషయాలు తప్ప మరో పథకం గురించి ప్రస్తావనే లేకపోవడం గమనార్హం. 

బాబాయ్‌ హత్య, కల్తీ నెయ్యి అంటూ విమర్శలకే పరిమితమైన చంద్రబాబు.. 100 రోజుల్లో చేసిందేమిటో చెప్పకపోవడంపై చర్చ సాగుతోంది. రానున్న రోజుల్లో ప్రభుత్వం ఏమి చేస్తుందో ప్రస్తావించకపోవడంపై జిల్లా వాసులు పెదవి విరుస్తున్నారు. భవిష్యత్‌లో ఫలానా పని చేస్తామని స్పష్టంగా చెప్పుకోలేని దుస్థితిలో పాలకులు ఉంటే ‘ఇది మంచి ప్రభుత్వం’ ఎలా అవుతుందన్న ప్రశ్న ప్రజల్లో ఉత్పన్నమైంది.

గ్రానైట్‌ పరిశ్రమలకు నిరాశ
సీఎం చంద్రబాబు అధికారం చేపట్టిన తర్వాత మొదటిసారి సంతనూతలపాడు నియోజకవర్గంలో అడుగుపెడుతుండటంతో గ్రానైట్‌ వ్యాపారుల్లో ఆశలు చిగురించాయి. రాయల్టీ సుంకాలు, విద్యుత్‌ చార్జీల భారం తగ్గిస్తారని, తమపై వరాల జల్లు కురిపిస్తారని భావించిన వ్యాపారులను చంద్రబాబు ప్రసంగం తీవ్ర నిరుత్సాహానికి గురిచేసింది. ఇటీవల సార్వత్రిక ఎన్నికలకు ముందు గ్రానైట్‌ పరిశ్రమను ఆదుకుంటామని చంద్రబాబు, లోకేష్‌ ఇచ్చిన హామీల జోలికి చంద్రబాబు వెళ్లకపోవడంతో పారిశ్రామికవేత్తలు డీలా పడ్డారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని చీమకుర్తి, బూదవాడ, మర్రిచెట్లపాలెంతో పాటు గుండ్లాపల్లి, ఒంగోలు శివారు ప్రాంతాలు, బల్లికురవ పరిసరాల్లో సుమారు 2500 గ్రానైట్‌ ఫ్యాక్టరీలు ఉన్నాయి. 

రాయల్టీ భారం తగ్గించి విదేశాలకు ఎగుమతులు నిలిచిపోకుండా పరిశ్రమలను ఆదుకుంటామని ఎన్నికల వేళ ఇచ్చిన హామీ ప్రకారం రాయితీలు ప్రకటిస్తారని వ్యాపారులు ఎదురు చూశారు. వాటితోపాటు జిల్లాలోని 800 యూనిట్లకు సుమారు రూ.250 కోట్ల వరకు ప్రోత్సాహకాలు రావాల్సి ఉందని అంచనా. వీటిని ఎప్పుడు అందిస్తారో చెప్పకుండానే చంద్రబాబు ప్రసంగం సాగింది.స్థానిక ఎమ్మెల్యే బీఎన్‌ విజయకుమార్‌ గుండ్లకమ్మ ప్రాజెక్ట్‌ పరిధిలో రెండు చెక్‌డ్యామ్‌లు కావాలని, రోడ్లు, కాలువలకు నిధులను కేటాయించాలని తన ప్రారంభ ఉపన్యాసంలో సీఎం దృష్టికి తీసుకొచ్చారు. అయినా సీఎం చంద్రబాబు నిధులు కేటాయిస్తామని చెప్పకపోవడం స్థానిక ప్రజలను ఆలోచనలో పడేసింది. ఇదిలా ఉండగా మద్దిరాల పాడు అంతా జిల్లా ఉన్నతాధికారులు, పోలీసులతో నిండిపోయింది.

ఎంపిక చేసిన లబ్ధిదారులతో పొగడ్తలు
చంద్రబాబు ప్రసంగించక ముందు అధికారులు ముందుగా ఎంపిక చేసిన లబ్ధిదారులతో మాట్లాడించారు. వారు ప్రభుత్వాన్ని పొగడ్తలతో ముంచెత్తారు. సింగరాయకొండలో ప్రైవేట్‌ కళాశాల నిర్వహిస్తున్న డాక్టర్‌ గీతారాణి ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌పై ప్రసంగించారు. ఈ చట్టం దార్వా ప్రజలకు అన్యాయం జరిగిందని ఆరోపణలు గుప్పిస్తూ ఆసాంతం తడబడ్డారు. ఆ తర్వాత గ్రామ సర్పంచ్‌ స్వర్ణ అనూరాధ, మరో మహిళ మండవ వెంకటేశ్వరమ్మ ప్రసంగించారు. అనూరాధ ప్రస్తావించిన సమస్యలు పరిష్కరిస్తానని చెప్పిన చంద్రబాబు నిధుల కేటాయింపు అంశాన్ని దాటవేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement