‘టికెట్‌ ఇస్తే నాకు లేదా నా భార్యకైనా ఇవ్వండి .. తమ్ముడికి వద్దు’ | - | Sakshi
Sakshi News home page

‘టికెట్‌ ఇస్తే నాకు లేదా నా భార్యకైనా ఇవ్వండి .. తమ్ముడికి వద్దు’

Published Tue, Jan 30 2024 1:30 AM | Last Updated on Tue, Jan 30 2024 11:32 AM

- - Sakshi

మార్కాపురం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే టికెట్‌ వ్యవహారం కందుల సోదరుల మధ్య చిచ్చు పెట్టింది. తనకు లేదా తన భార్యకు టికెట్‌ ఇవ్వాలని ప్రస్తుత పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ కందుల నారాయణరెడ్డి పట్టుపడుతుంటే.. గతంలో రెండుసార్లు ఓడిపోయారు కనుక ఈసారికి తనపేరు పరిశీలించాలని ఆయన సోదరుడు రామిరెడ్డి.. చంద్రబాబును కోరారు.  ఈ వ్యవహారంతో పార్టీ శ్రేణుల్లో గందరగోళం నెలకొంది. మరోవైపు జనసేన నుంచి  తనకు టికెట్‌ ఇస్తే పోటీ చేసి గెలుస్తానంటూ ఇమ్మడి కాశీనాథ్‌ పవన్‌కళ్యాణ్‌ను కోరినట్లు తెలుస్తోంది.

ఒంగోలు సాక్షి ప్రతినిధి: పశ్చిమ ప్రకాశంలోని మార్కాపురం టీడీపీలో ముసలం మొదలైంది. కందుల సోదరుల మధ్య కుర్చీ కోసం అంతర్గత పోరు తీవ్రమైంది. ప్రస్తుత టీడీపీ ఇన్‌చార్జి కందుల నారాయణరెడ్డి 2009లో మార్కాపురం నుంచి పోటీచేసి మొదటిసారి గెలుపొందారు. 2014లో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి జంకె వెంకటరెడ్డి, 2019లో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి ప్రస్తుత ఎమ్మెల్యే కుందురు నాగార్జునరెడ్డిపై భారీ తేడాతో ఓటమి పాలయ్యారు.

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మరో దఫా పోటీ చేసేందుకు సిద్ధమయ్యాడు. ఇదే సమయంలో ఆయన సోదరుడు మాజీ జెడ్పీటీసీ కందుల రామిరెడ్డి కూడా టికెట్‌ రేసులో ఉండటంతో కందుల సోదరుల మధ్య అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కందుల నారాయణరెడ్డికి టికెట్‌ ఇచ్చే విషయంలో విముఖత చూపడంతో నారాయణరెడ్డి తన భార్య పేరుతో వారంరోజుల క్రితం దరఖాస్తు పంపుకున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఇది హాట్‌టాపిక్‌గా మారింది.

దీంతో రామిరెడ్డి కూడా టికెట్టు కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికి మూడు సార్లు పోటీచేసి ఒక్కసారి మాత్రమే నారాయణరెడ్డి గెలుపొందడంతో తనకు అవకాశం ఇవ్వాలని కుటుంబ సభ్యులతో రామిరెడ్డి చెప్పినట్లు తెలిసింది. ఈ ఒక్కసారి తాను పోటీ చేస్తానని నారాయణరెడ్డి గట్టిగా పట్టుబట్టాడు. అయితే అధినేత చంద్రబాబు దృష్టిలో గుడ్‌విల్‌ లేకపోవడంతో పాటు ఇటీవల రోడ్డు యాక్సిడెంట్‌కు గురై సరిగా నడవలేకపోవడం, ప్రజల్లో అనుకున్నంత సానుభూతి లేనట్లుగా చంద్రబాబు చేయించిన సర్వేలో బయటపడటంతో ఆయన ఈసారికి నువ్వొద్దులే.. అని చెప్పడంతో తనకు కాకపోయినా తన భార్యకై నా టికెట్‌ ఇవ్వాలని బాబును నారాయణరెడ్డి కోరినట్లు తెలిసింది. ఈ ప్రతిపాదనపై చంద్రబాబు నుంచి ఎటువంటి సానుకూల స్పందన రాకపోవడంతో కుటుంబంలో ఆందోళన మొదలైంది.

గందరగోళంలో టీడీపీ శ్రేణులు:
కాగా గెలుస్తామనే ధీమా లేకున్నప్పటికీ టికెట్‌ విషయంలో అన్నదమ్ముల మధ్య జరుగుతున్న విభేదాలతో మార్కాపురం నియోజకవర్గ టీడీపీ కార్యకర్తల్లో గందరగోళం నెలకొంది. టికెట్‌ విషయంలోనే విభేదాలుంటే రేపు అన్నదమ్ముల్లో ఒకరికి టికెట్‌ వస్తే మరొకరు సహకరిస్తారా అన్న ప్రశ్న కూడా కార్యకర్తల్లో తలెత్తింది. ఈ విభేదాలు పార్టీకి నష్టం చేకూర్చేలా ఉన్నాయని కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సందట్లో సడేమియా లాగా జనసేన నుంచి ఒత్తిడి:
టీడీపీలో టికెట్‌ విషయమై అన్నదమ్ముల మధ్య విభేదాలు బహిర్గతం కాగా సందట్లో సడేమియా లాగా మరో వైపు జనసేన ఇన్‌చార్జి ఇమ్మడి కాశీనాథ్‌ పొత్తులో భాగంగా మార్కాపురం సీటు జనసేనకు ఇవ్వాలని, తాను పోటీచేసి గెలిచి పవన్‌కల్యాణ్‌కు గిఫ్ట్‌గా ఇస్తానని సోమవారం ప్రకటించడంతో టీడీపీ నేతల్లో ఆందోళన మొదలైంది. టికెట్‌ విషయంలో తమకు ఎదురులేరని భావిస్తున్న కందుల సోదరులకు కాశీనాథ్‌ వైపు నుంచి టికెట్‌ ఇవ్వాలనే ప్రతిపాదన రావడం ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందన్న చర్చ జరుగుతోంది. కాశీనాథ్‌ 2019లో జరిగిన ఎన్నికల్లో జనసేన అభ్యర్థిగా మార్కాపురం నుంచి పోటీచేసి ఓటమి పాలయ్యారు. కాశీనాథ్‌ అభ్యర్థిత్వాన్ని ఒకవేళ పార్టీ పొత్తులో భాగంగా జనసేనకు మార్కాపురాన్ని కేటాయిస్తే ఎలా అన్న చర్చ విస్తృతంగా జరుగుతోంది. ఇప్పటి వరకూ జనసేన వైపు నుంచి ఎటువంటి ప్రతిపాదన రాకపోవడంతో కందుల నారాయణరెడ్డి టికెట్‌ తనకేనన్న ధీమాతో ఉన్నాడు. 

కాశీనాథ్‌ కూడా ఇటీవల పవన్‌కల్యాణ్‌ను కలిసి మార్కాపురం అసెంబ్లీ స్థానాన్ని జనసేనకు కేటాయిస్తే తాను పోటీ చేస్తానని స్పష్టం చేశారు. మొత్తం మీద టికెట్‌ రగడ టీడీపీ, జనసేనలో విభేదాలు సృష్టిస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement