మెగా డీఎస్సీతో జిల్లాకు అన్యాయం
ఒంగోలు టౌన్: కూటమి ప్రభుత్వం ప్రకటించిన మెగా డీఎస్సీతో జిల్లాకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, దీనిపై జిల్లాకు చెందిన అధికారపార్టీ ఎమ్మెల్యేలు స్పందించాల్సిన అవసరం ఉందని డీవైఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి జి.రామన్న అన్నారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు తక్షణమే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. స్థానిక ఎల్బీజీ భవనంలో డీవైఎఫ్‌ఐ జిల్లా కమిటీ సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డీఎస్సీపై కాలయాపన చేయడం కూటమి ప్రభుత్వానికి తగదని హితవు పలికారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను ఎప్పుడు భర్తీ చేస్తారో చెప్పాలని ప్రశ్నించారు. ఉద్యోగాల భర్తీ చేయకపోతే వెంటనే నిరుద్యోగ భృతి ఇవ్వాలన్నారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా డ్రగ్స్ విలయ తాండవం చేస్తుంటే పాలకులకు పట్టించుకునే తీరికలేకుండా పోయిందని విమర్శించారు. డ్రగ్స్ నివారణపై మాటలు తప్ప చేతలు లేవని, ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా డ్రగ్స్ నివారణ కమిటీలు వేసి పకడ్బందీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జనవరి 1వ తేదీ జాబ్ కేలండర్ విడుదల చేస్తామని నారా లోకేష్ చెప్పారని, ఇప్పుడు జనవరి కూడా వెళ్లిపోతుందని చెప్పారు. డీవైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు కేవీ పిచ్చయ్య మాట్లాడుతూ జిల్లాలో ఒక్క రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లోనే అన్నీ రకాల కేడర్ కలుపుకొని 649 పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. వీటిని భర్తీ చేయాలని, ఇతర శాఖలకు చెందిన ఖాళీ ఉద్యోగాలను కూడా భర్తీ చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఆ సంస్థ జిల్లా కార్యదర్శి కేఎఫ్ బాబు మాట్లాడుతూ జిల్లాలోని దొనకొండ పారిశ్రామిక కారిడార్, దర్శి డ్రైవింగ్ స్కూల్, చీమకుర్తి శిల్పారామం, కనిగిరి నిమ్జ్, ఏకే యూనివర్శిటీలకు నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో యువజన నాయకులు పి.కిరణ్, నరేంద్ర, కొండయ్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment