గుర్తుతెలియని వాహనం ఢీకొని దుప్పి మృతి
దర్శి: గుర్తు తెలియని వాహనం ఢీకొని దుప్పి మృతి చెందింది. ఈ ఘటన పట్టణంలోని ఎంవీఐ కార్యాలయం సమీపంలో బుధవారం ఉదయం జరిగింది. వివరాల్లోకి వెళితే.. తెల్లవారుజామున దుప్పి రోడ్డుపై వెళుతుండగా గుర్తు తెలియని వాహనం వేగంగా వచ్చి దుప్పిని ఢీకొట్టి ఆగకుండా వెళ్లిపోయింది. ప్రమాదంలో దుప్పి అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. దుప్పి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎఫ్‌బీఓ అమర తెలిపారు.
విద్యుత్ విజిలెన్స్
అధికారుల తనిఖీలు
● 115 కేసులకు సంబంధించి
రూ.5.92 లక్షల జరిమానా
నాగులుప్పలపాడు: ఒంగోలు డివిజన్ పరిధిలోని నాగులుప్పలపాడు మండలంలోని విద్యుత్ విజిలెన్స్ అఽధికారులు అకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్‌ఈ విజయకృష్ణ మాట్లాడుతూ మండల వ్యాప్తంగా విద్యుత్ అధికారులు 34 బృందాలుగా ఏర్పడి తనిఖీలు చేపట్టగా అదనపు లోడు వినియోగిస్తున్న 106 సర్వీసులకు గాను రూ.5,31,600, విద్యుత్ చౌర్యానికి పాల్పడిన ఒక సర్వీసుకు రూ.10 వేలు, గృహాల కింద విద్యుత్ కనెక్షన్ తీసుకొని వ్యాపారాలకు వినియోగిస్తున్న 8 సర్వీసులకు రూ.51 వేల జరిమానా విధించినట్లు తెలిపారు. తనిఖీల్లో డీపీఈ హైమావతి, ఈఈ హరిబాబు, డీఈ శ్రీకాంత్, రంగారావు, ఏఈ రమేష్‌బాబు సిబ్బంది పాల్గొన్నారు.
దైవచింతన పేరుతో రూ.కోటికి టోకరా
మద్దిపాడు: దైవచింతన పేరుతో రూ.కోటికి పైగా ఒక మహిళ టోకరా వేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మద్దిపాడు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మద్దిపాడుకు చెందిన పురాలశెట్టి ఆంజనేయులు సిటీ కేబుల్ నిర్వహిస్తున్నాడు. వారి ఇంట్లో సుద్ధపల్లి రాజేశ్వరి అనే మహిళ రెండేళ్లుగా బాడుగకు ఉంటుంది. ఈ క్రమంలో ఆంజనేయులు భార్య లక్ష్మితో సన్నిహితంగా ఉంటూ ఆధ్యాత్మిక చింతన పేరుతో పూజలు, దైవ సంబంధిత మాటలు చెప్పేది. ఈ క్రమంలో తనకు సుమిత్ర అను దైవంశ సంభూతురాలితో పరిచయం ఉన్నట్లు మాయమాటలు చెప్పింది. అనంతరం బంగారం ఇంట్లో ఉంటే అశుభం కలుగుతుందని చెప్పి లక్ష్మీ వద్ద ఉన్న 110 సవర్ల బంగారు ఆభరణాలను మాయమాటలతో తీసుకొని పలు బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థల్లో రూ.35 లక్షలకు తాకట్టు పెట్టింది. దీంతో పాటు ఆమె వద్ద రూ.11.50 లక్షల నగదును తీసుకుంది. దీనిపై ఆంజనేయులు పలుమార్లు రాజేశ్వరిని నగదు ఇవ్వమలని కోరగా..ఆమె చేతులెత్తేయడంతో ఆంజనేయులు పోలీస్‌స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎస్సై శివరామయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment