పొగాకు రైతుల దోపిడీకి కుట్ర
ఒంగోలు సిటీ: పొగాకు రైతులను వ్యాపారులు దోపిడీ చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు నియోజకవర్గ ఇన్‌చార్జి చుండూరు రవిబాబు ఆరోపించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కర్నాటక రాష్ట్రం మైసూరులో నేడు కేజీ పొగాకు రూ.360లకు కొనుగోలు చేస్తుంటే జిల్లాలో మాత్రం రూ.280 కి కొనుగోలు చేయడం దారుణమన్నారు. గత ఏడాది వచ్చిన ధరల ఆధారంగా ఈ సారి రైతులు ఖర్చులు ఎక్కువైనా పొగాకు సాగు చేశారన్నారు. కూలీ, కౌలు, బ్యారన్ రేట్లు భారీగా పెరిగాయని చెప్పారు. అయినా గత సంవత్సరం వచ్చిన సరాసరికి తగ్గించి కొనుగోలు చేయాలన్న కుట్ర జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. పొగాకు సాగు ఎక్కువైనందున ధరలు రావన్న ప్రచారం సాగుతోందని, దీనిని రైతులు నమ్మవద్దని ఆయన కోరారు. పొగాకు కొనుగోలు సీజన్ ప్రారంభంలోనే దోపిడీ మొదలైందని ఆయన ఆరోపించారు. అంతర్జాతీయంగా పొగాకుకు మంచి డిమాండ్ ఉంది కనుకనే మైసూరులో అత్యధిక ధరలకు కొనుగోలు చేస్తున్నారన్న విషయాన్ని జిల్లా రైతులు గుర్తుంచుకోవాలన్నారు.
రైతుల పక్షాన వైఎస్సార్ సీపీ:
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ రైతుల పక్షాన నిలుస్తోందన్నారు. గతంలో పొగాకు రైతులు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సమయంలో రైతుల నష్టపోకుండా ఉండేందుకు అప్పుడు సీఎంగా ఉన్న జగన్ మోహన్‌రెడ్డి రూ.200 కోట్లు కేటాయించి మార్క్‌ఫెడ్‌ను రంగంలోకి దించి అండగా నిలిచారన్నారు. ఫలితంగా ధరలు పుంజుకున్నాయని చెప్పారు. మార్క్‌ఫెడ్ కూడా లాభపడిందన్నారు.
సిండికేట్ అయి దగా..
సిగరెట్ తయారీదారులు వ్యాపారస్తులను సిండికేట్‌గా చేసుకుని రైతులను దగా చేసేందుకు కుయుక్తులు పన్నుతున్నారని ఆరోపించారు. ఇప్పుడున్న ధరలకు మరో రూ.10 నుంచి రూ.20 వరకూ తగ్గించి కొనుగోలు చేయాలన్న కుట్ర కూడా జరుగుతోందన్నారు. రూ.270 సరాసరి వస్తేనే అసలు దక్కుతుందని, రైతులు అప్రమత్తంగా ఉండాలన్నారు. కర్నాటకలో కొనుగోళ్లు పూర్తి కాలేదని, బయ్యర్లు అందరూ అక్కడే ఉన్నారని, వారు వచ్చే వరకూ రైతులు వేచి చూడాలని సూచించారు. రూ.300పైన అయితేనే అమ్ముకోవాలన్నారు. ప్రభుత్వం కూడా రైతులను వంచిస్తే ఊరుకోమని, మా పార్టీ, మా పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రైతులకు ఎప్పుడూ అండగా ఉంటారన్నారు. మా పార్టీ ఎంపీలు రైతు సమస్యలు పార్లమెంట్‌లో ప్రస్తావించేందుకు సిద్ధంగా ఉన్నారని, ఇదే విషయాన్ని రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి రైతులకు తెలిపి అండగా నిలవాలని సూచించారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మిరప, కంది, పత్తి రైతులు అన్ని రకాలుగా నష్టపోతున్నారని పార్టీ రాష్ట్ర కార్యదర్శి కేవీ రమణారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. రైతులకు ఆత్మహత్యలే శరణ్యంగా ప్రస్తుత పరిస్థితులు నెలకొన్నాయన్నారు. ఒక వైపు సంక్షోభ పరిస్థితులు కొనసాగుతుంటే మరో పక్క పొగాకు మార్కెట్‌లో ధరలు దిగజారిపోతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తక్కువ ధరకు అమ్ముకుని నష్టపోవద్దని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంటుందని అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మారెడ్డి సుబ్బారెడ్డి మాట్లాడుతూ రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం కానీ, పంటలు కొనేనాథుడే కరువయ్యారని విమర్శించారు. సమావేశంలో ఒంగోలు, నాగులుప్పలపాడు, సంతనూతలపాడు మండల పార్టీల అధ్యక్షులు మన్నే శ్రీనివాసులు, శ్రీమన్నారాయణ, దుంపా చెంచిరెడ్డి, జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు బొట్ల సుబ్బారావు, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు దుంపా రమణమ్మ, మాజీ ఏఎంసీ చైర్మన్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
వ్యాపారుల సిండికేట్‌కు కుయుక్తులు కర్నాటక మార్కెట్లో కేజీ రూ.360 జిల్లాలో కేజీ రూ.280కే కొనుగోలు అన్యాయం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రైతులకు అండగా ఉంటుంది పార్టీ ఒంగోలు నియోజకవర్గ ఇన్‌చార్జి చుండూరు రవిబాబు
Comments
Please login to add a commentAdd a comment