
ఒకే రాత్రి ఐదు ఆలయాల్లో దొంగతనం
దర్శి: మండలంలో ఒకే రాత్రి ఐదు ఆలయాల్లో చోరీలు జరిగాయి. ఈ సంఘటనలు మండలంలోని లంకోజనపల్లి, వెంకటాపురం గ్రామాల్లో మంగళవారం రాత్రి జరిగాయి. లంకోజనపల్లి ఆంజనేయస్వామి ఆలయంలో హుండీ పగులగొట్టి సుమారు రూ.25 వేల నగదు తీసుకెళ్లారు. తూర్పు వెంకటాపురంలో పోలేరమ్మ, అంకాలమ్మ, శివాలయం, బాలాపుర పోలేరమ్మ ఆలయాల్లో తాళాలు పగులగొట్టి హుండీల్లో ఉన్న సుమారు రూ.20 వేల నగదు దొంగలు ఎత్తుకెళ్లారు. పోలేరమ్మ ఆలయంలో వెండి హారం, కిరీటం ఉండగా కిరీటాన్ని వదిలేసి వెండి హారం, హుండీని ఎత్తుకెళ్లారు. మిగిలిన మూడు ఆలయాల్లో హుండీలు ఎత్తుకెళ్లి పగులగొట్టి నగదు దోచుకున్నారు. ఒకే రోజు వరుస దొంగతనాలు జరగడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల ముండ్లమూరు మండలంలో కూడా ఇదే విధంగా ఒకే రాత్రి మూడు దొంగతనాలు జరిగాయి.

ఒకే రాత్రి ఐదు ఆలయాల్లో దొంగతనం