
శ్రీశైలం ఘాట్‌లో త్రుటిలో తప్పిన ప్రమాదం
పెద్దదోర్నాల: వేగంగా వెళ్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగిన సంఘటన శుక్రవారం శ్రీశైలం ఘాట్ రోడ్డులోని చింతల గిరిజనగూడెం సమీపంలో చోటు చేసుకుంది. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించటంతో వాహనంలో ప్రయాణిస్తున్న వారు ఎటువంటి ప్రమాదానికి గురి కాకుండా సురక్షితంగా బయటపడ్డారు. అందిన సమాచారం మేరకు.. గుంటూరుకు చెందిన రవీంద్రకుమార్ తన మిత్రుడైన కొమ్మూరి శ్రీనుకు చెందిన రెనాల్ట్ కారును తీసుకుని కుటుంబ సభ్యులతో కలిసి దైవ దర్శనం కోసం శ్రీశైలానికి బయలు దేరాడు. ఈ క్రమంలో చింతల గిరిజన గూడెం దాటి ఘాట్‌లో ప్రయాణిస్తున్న సమయంలో కారు ఇంజన్ భాగంలో ఒక్కసారిగా దట్టమైన పొగలతో మంటలు చెలరేగాయి. ఈ సమయంలో డ్రైవర్ చాకచక్యంగా వేగాన్ని నియంత్రించి కారును రోడ్డుకు ఓ పక్కకు నిలిపి వేయటంతో ప్రయాణికులు సురక్షితంగా బయట పడ్డారు. ఈ సమయంలో డ్రైవర్ కంగారుకు గురైతే పక్కనే ఉన్న భారీ లోయలోకి కారు దూసుకు వెళ్లేదని, త్రుటిలో పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నామని కారులో ప్రయాణిస్తున్న రవీంద్రకుమార్ కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న ఎస్సై మహేష్ సిబ్బందితో కలిసి హుటాహుటిన సంఘటనా స్థలికి చేరుకుని ట్రాఫిక్‌కు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టారు. ఫైర్ అధికారులు సిబ్బందిలో కలిసి అగ్నిమాపక వాహనంతో సంఘటనా స్థలికి చేరుకుని మంటలను ఆర్పి వేశారు. ఇంజన్ భాగంలోని బ్యాటరీలో షార్ట్ సర్క్యూట్ తోనే మంటలు చెలరేగి ఉంటాయని అధికారులు భావిస్తున్నారు. కారులో మంటలు వ్యాపించిన సమయంలో పెద్ద పెద్ద శబ్దాలు రావటంతో శ్రీశైలం ఘాట్‌లో ప్రయాణించే వాహనదారులు ఒకింత ఆందోళనకు గురయ్యారు.
వేగంగా వెళ్తున్న కారులో చెలరేగిన మంటలు
డ్రైవర్ సమయ స్ఫూర్తితో ప్రయాణికులు సురక్షితం

శ్రీశైలం ఘాట్‌లో త్రుటిలో తప్పిన ప్రమాదం