
బతుకులు వెనక్కు!
తీరం ముందుకు..
కోతకు గురైన తీరం
సింగరాయకొండ:
జిల్లా పరిధిలో సముద్ర తీరం సుమారు 50 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. కొండపి నియోజకవర్గంలోని టంగుటూరు, సింగరాయకొండ మండలాల పరిధిలో సుమారు 12 కిలోమీటర్లు దూరం తీరం ఉంది. టంగుటూరు మండల పరిధిలో తేటుపురం, తాళ్లపాలెం, కేశుపాలెం, సింగరాయకొండ మండల పరిధిలో పాకల పంచాయతీలో పల్లెపాలెం, చెల్లెమ్మగారిపట్టపుపాలెం, పోతయ్యగారి పట్టపుపాలెం, క్రాంతి నగర్, శాంతినగర్, ఊళ్లపాలెం పంచాయతీ పరిధిలో దేవలంపల్లెపాలెం, బేసిన్ పల్లెపాలెం, బావివద్ద పల్లెపాలెం ఉన్నాయి. కొన్ని సంవత్సరాలుగా ఊళ్లపాలెం తీరంలో సముద్రం మార్చి, ఏప్రిల్ మాసంలో సుమారు 10 నుంచి 20 మీటర్లు ముందుకు వస్తుండేది. ఈ సంవత్సరం మాత్రం సుమారు 40 నుంచి 50 మీటర్ల వరకు ముందుకు వచ్చిందని మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో తీరంలో ఉన్న రొయ్యల చెరువుల కట్టలు కోతకు గురయ్యాయని మత్స్యకారులు తెలిపారు. ఊళ్లపాలెం తీరంలో విచిత్రంగా ఊళ్లపాలెం, పాకల పంచాయతీ లోని పోతయ్య గారి పట్టపుపాలెంకు మధ్య మాత్రమే తీరం భారీగా కోతకు గురికాగా, ఊళ్లపాలెం తీరానికి దక్షిణం వైపు మాత్రం 10 మీటర్లు కోతకు గురైంది.
అడ్డంకిగా మారిన రోడ్డు..
ఊళ్లపాలెం తీరంలో నిర్మించిన రోడ్డు బోట్ల భద్రతకు అడ్డంకిగా మారింది. సముద్ర తీరంలో గత ఏడాది అక్టోబర్‌లో ఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధులు సుమారు రూ.20 లక్షలతో తీరానికి సమాంతరంగా రోడ్డు నిర్మించి విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేశారు. మొదట రోడ్డును తీరానికి సుమారు 80 మీటర్ల దూరంలో ఏర్పాటు చేద్దామని భావించారు. అయితే తరువాత ఇంజినీరింగ్ అధికారులు తీరానికి సుమారు 50 మీటర్ల దూరంలోనే నిర్మించాలని సూచించారు. ఇంజినీరింగ్ అధికారుల నిర్ణయాన్ని మత్స్యకారులు అప్పట్లో వ్యతిరేకించారు. అధికార టీడీపీ నాయకుల ఒత్తిడితో ఏమీ చేయలేక ఊరుకున్నారు. దీనికి తోడు అధికార పార్టీ నాయకులే ఈ రోడ్డు నిర్మించారని ఆరోపణలు ఉన్నాయి. ఈ రోడ్డు నిర్మాణం విషయమై తనకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదని గ్రామ సర్పంచ్ పాకనాటి అనసూర్యమ్మ ఆరోపించారు. గ్రామంలో టీడీపీ నాయకుల ఇష్ట్రపకారమే పనులు జరిగాయన్నారు. ఈ రోడ్డు కారణంగా తీరంలో బోట్లు వెనక్కి జరుపుకోలేక మత్స్యకారులు అవస్థలు పడుతున్నారు. బోట్లు భద్రపరుచుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని వారు అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.
కోతకు గురైన ఊళ్లపాలెం సముద్ర తీరం సుమారు 40 మీటర్లు ముందుకు వచ్చిన సముద్రం ధ్వంసమైన రొయ్యల చెరువు కట్టలు మత్స్యకారుల గుండెల్లో గుబులు బోట్ల భద్రతపై ఆందోళన తీరానికి దగ్గరగా రూ.20 లక్షలతో రోడ్డు నిర్మాణం బోట్లు వెనక్కి జరుపుకోవాలంటే అడ్డుగా ఉన్న రోడ్డు
నాసిరకంగా రోడ్డు నిర్మాణం
రోడ్డు నాసిరకంగా నిర్మించారని, నిబంధనల ప్రకారం క్యూరింగ్ కూడా చేయలేదన్న ఆరోపణలు ఉన్నాయి. అంతేకాక రోడ్డు మార్జిన్లు కూడా తూతూ మంత్రంగా వేశారని, చిన్న వర్షానికి అవి ధ్వంసం అయ్యే ప్రమాదం ఉందని, కేవలం ధనార్జనే ధ్యేయంగా రోడ్లు నిర్మించారని మత్స్యకారులు ఆరోపిస్తున్నారు.