
రంగనాయకుని బ్రహ్మోత్సవం ప్రారంభం
రాచర్ల: నల్లమల అటవీ ప్రాంతంలో రాచర్ల మండలంలోని జేపీ చెరువు గ్రామ సమీపంలో వెలసిన నెమలిగుండ్ల రంగనాయకస్వామి బ్రహ్మోత్సవాలు శనివారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. జిల్లా నుంచే కాకుండా పక్క జిల్లాలైన కర్నూలు, గుంటూరు, వైఎస్సార్ జిల్లా నుంచి అధిక సంఖ్యలో భక్తులు స్వామివారి దర్శనం కోసం పోటెత్తారు. భారీగా క్యూ కట్టి స్వామివారిని దర్శనం చేసుకున్నారు. దేవస్థానం అర్చకులైన అన్నవరం పాండురంగాచార్యులు, అన్నవరం సత్యనారాయణాచార్యులు, అన్నవరం వెంకటరంగాచార్యులు ఆధ్వర్యంలో సాయంత్రం నాలుగు గంటలకు అంకురార్పణ, విష్వక్సేన ఆరాధన, పుణ్యహవచనము, ముత్యాంగ్రహణం, యాగశాల ప్రవేశం, రాత్రి 7 గంటలకు పూలంగి సేవ, శేషవాహనం, రాత్రి 8:30 గంటలకు ధ్వజారోహణం, రాత్రి 10 గంటలకు నెమలిగుండ్ల రంగనాయకస్వామి అలంకారం, ఆదివారం రాత్రి 2 గంటలకు హనుమంత వాహనం కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించి అశీసులు అందుకున్నారు. ఆదివారం జరిగే నెమలిగుండ్ల రంగనాయకస్వామి కళ్యాణానికి దేవస్థానం కార్యనిర్వహణాధికారి మల్లవరపు నాగయ్య ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. స్వామివారి కళ్యాణం రోజు మండపం వద్ద భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తగా బ్యారికేడ్లు ఏర్పాటు చేసినట్లు గిద్దలూరు రూరల్ సీఐ రామకోటయ్య తెలిపారు. భక్తులకు కాశీనాయన రెడ్ల, యోగివేయన రెడ్ల, కృష్ణదేవరాయుల కాపు బలిజ, గోపాలకృష్ణ యాదవ, ఆర్యవైశ్య, మేదర, బ్రహ్మణ, విశ్వబ్రహ్మణ అన్నసత్రాల్లో అన్నసంతర్పణ చేశారు.
వైభవంగా ఉత్సవ విగ్రహాల
ఊరేగింపు
అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు

రంగనాయకుని బ్రహ్మోత్సవం ప్రారంభం