
● కార్యకర్తలో ఉత్సాహం ● తరలివచ్చిన పట్టభద్రులు, పార్టీ
కరీంనగర్ కార్పొరేషన్:
మెదక్– నిజామాబాద్– కరీంనగర్– ఆదిలాబాద్ పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌కు రెండు రోజుల ముందు సోమవారం కరీంనగర్‌లోని ఎస్సారార్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన పట్టభద్రుల సంకల్ప సభ సక్సెస్ కావడం కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ నింపింది. వేలాది మందిగా పట్టభద్రులు, కాంగ్రెస్ కార్యకర్తలు తరలిరాగా... నిరుద్యోగులు, ఉద్యోగులకు తాము చేసింది చెబుతూ, సీఎం రేవంత్‌రెడ్డి చేసిన ఆవేశపూరిత ప్రసంగం ఓటర్లపై ప్రభావం చూపుతుందనే ధీమాను హస్తం నేతలు వ్యక్తం చేశారు. సభకు పీసీసీ అధ్యక్షుడితో పాటు, జిల్లా మంత్రులు, ఇద్దరు ఇన్‌చార్జీ మంత్రులు, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ఇన్‌చార్జీలు తరలివచ్చారు.
ఉద్యోగాలు కావాలంటే కాంగ్రెస్సే శరణ్యం
రాష్ట్రంలో ఉద్యోగాలు కావాలంటే కాంగ్రెస్ పార్టీయే శరణ్యమని పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ స్పష్టం చేశారు. ఉద్యోగాలతో పాటు, అభివృద్ధి, సంక్షేమం కొనసాగాలంటే కాంగ్రెస్‌కు మద్దతివ్వాలన్నారు. 2004లో కరీంనగర్ గడ్డపై సోనియాగాంధీ చెప్పిన మాట ప్రకారం తెలంగాణ ఇచ్చిందని గుర్తు చేశారు. తెచ్చుకున్న తెలంగాణలో కేసీఆర్ ఇంటికి ఉద్యోగాలొచ్చాయి కానీ, ఎవరికీ ఉద్యోగాలు రాలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 56 వేల ఉద్యోగాలిచ్చామని, ఖాళీలన్నీ భర్తీ చేస్తామని అన్నారు. ఆర్థిక నిర్బంధం ఉన్నప్పటికీ, ఇచ్చిన మాట ప్రకారం ఒక్కోటిగా నెరవేరుస్తూ వస్తున్నామన్నారు. ఇన్ని పనులు చేస్తున్నా ఫామ్‌హౌస్‌లో పడుకొని ఆరు నెలలకోసారి లేచే వాళ్లు ఏదేదో మాట్లాడుతున్నారని విమర్శించారు. తాము 56 శాతం ఉన్నామని బీసీలు చెప్పుకొనేలా చేసింది కాంగ్రెస్ పార్టీ అన్నారు. బీసీ అయిన బండి సంజయ్‌ని బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తొలగిస్తే ఆ పార్టీలో ఎవరూ పట్టించుకోలేదన్నారు.
● జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ పదేళ్ల తరువాత ఉపాధ్యాయులకు బదిలీలు, పదోన్నతులు కల్పించింది కాంగ్రెస్ ప్రభుత్వమేనన్నారు. 11 వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసామని తెలిపారు.
● ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు మాట్లాడుతూ ప్రైవేట్ రగంలో ఉద్యోగాలిచ్చేందుకు ఉమ్మడి జిల్లాలోని 13 నియోజకవర్గాల్లో నైపుణ్య కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. ఉపాధి, ఉద్యోగాలకు ఈ కేంద్రాలు దోహదం చేస్తాయని తెలిపారు. పట్టభద్రుల బంగారు భవిష్యత్ కోసం తాము బాటలు వేస్తున్నామన్నారు. విద్యారంగానికి సేవలందించిన నరేందర్‌రెడ్డిని గెలిపించాలన్నారు.
● బీసీ సంక్షేమ, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో ప్రశ్నించే గొంతుకగా జీవన్‌రెడ్డిని గెలిపించుకున్నామన్నారు. ఇప్పుడు సంధానకర్త అవసరమని, అందుకే నరేందర్‌రెడ్డికి ఓటు వేయాలన్నారు. 15 నెలల్లోనే ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్న ప్రభుత్వానికి మద్దతునివ్వాలని కోరారు.
● మంత్రి సీతక్క మాట్లాడుతూ పనిచేసే ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలన్నారు. ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నిక ఆరు పార్లమెంట్, 42 అసెంబ్లీ నియోజకవర్గాలకు, రాష్ట్రంలో 40 శాతానికి విస్తరించి ఉందన్నారు. అందుకే ఇది ప్రతిష్టాత్మక ఎన్నిక అన్నారు.
● ఎమ్మెల్సీ కోదండరాం మాట్లాడుతూ రాష్ట్రంలో ఫోన్‌ట్యాపింగ్, నిఘాలు లేవని మొదటిసారి ప్రజాస్వామిక వాతావరణం కనిపిస్తోందన్నారు. వైఎస్‌ఆర్ తరువాత ఇంత పెద్ద ఎత్తున రుణమాఫీ ఇప్పుడే జరిగిందన్నారు.
● ఎమ్మెల్సీ అభ్యర్థి వూటుకూరి నరేందర్‌రెడ్డి మా ట్లాడుతూ సీఎం రేవంత్ పాలన ట్వంటీ ట్వంటీ మ్యాచ్‌ను తలపిస్తోందన్నారు. ప్రైవేట్ విద్యాసంస్థల్లో పనిచేసే వారికి ఉద్యోగ భద్రత కల్పిస్తానని, రూ.3 లక్షల భీమా వర్తింపచేస్తానన్నారు.
● కాగా దర్మపురికి కేటాయించిన నవోదయ విద్యాలయాన్ని ధర్మపురిలోనే ఏర్పాటు చేయాలని పలువురు సభలో ప్లకార్డులు ప్రదర్శించారు. ప్రభుత్వ విప్‌లు అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, చింతకుంట విజయరమణారావు, మేడిపల్లి సత్యం, మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్, సంజయ్, ఎమ్మెల్సీ భానుప్రసాద్‌రావు, వి.రాజేందర్‌రావు, కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, సత్తు మల్లేశం, మెనేని రోహిత్‌రావు, బొమ్మ శ్రీరాం, వొడితెల ప్రణవ్, కేకే మహేందర్‌రెడ్డి, సీపీఐ నాయకులు చాడవెంకటరెడ్డి, మర్రి వెంకటస్వామి పాల్గొన్నారు.
‘కవ్వంపల్లి’ క్యాంపు ఆఫీసుకు సీఎం రేవంత్
తిమ్మాపూర్: ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం కోసం కరీనంగర్‌కు వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి సభ అనంతరం హైదరాబాద్‌కు రోడ్డు మార్గంలో బయల్దేరారు. ఈ క్రమంలో తిమ్మాపూర్ మండలం మహాత్మనగర్‌లోని మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వపల్లి సత్యనారాయణ క్యాంపు కార్యాలయానికి వచ్చారు. సీఎంకు ఎమ్మెల్యేతో పాటు, పార్టీ మండల అధ్యక్షుడు మోరపల్లి రమణారెడ్డి స్వాగతం పలికారు. టీ తాగిన అనంతరం హైదరాబాద్ బయల్దేరి వెళ్లారు. సీఎం వెంట మంత్రులు ఉత్తం కుమార్‌డ్డి, పొన్నం ప్రభాకర్, శ్రీధర్‌బాబు ఉన్నారు.

● కార్యకర్తలో ఉత్సాహం ● తరలివచ్చిన పట్టభద్రులు, పార్టీ

● కార్యకర్తలో ఉత్సాహం ● తరలివచ్చిన పట్టభద్రులు, పార్టీ
Comments
Please login to add a commentAdd a comment