ఇబ్రహీంపట్నం: కనిపించకుండా పోయిన యువకుడి మృతదేహం ఇబ్రహీంపట్నం పెద్ద చెరువులో లభ్యమైంది. ఎస్‌ఐ నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న సింగారం మధు(24), శుక్రవారం నుంచి కనిపించకుండా పోయాడు. అతని ఆచూకీ కోసం బంధువులు, స్నేహితుల ఇళ్ల వద్ద కుటుంబీకులు ఆరా తీశారు. ఫలితం లేకపోవడంతో తండ్రి జ్ఞానేశ్వర్ శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆదివారం స్థానిక పెద్ద చెరువు తూము వద్ద మధు చెప్పులు, పర్సు, ఐడీ కార్డు, సెల్‌ఫోన్‌ను స్థానికులు గుర్తించి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. డీఆర్‌ఎఫ్ బృందం చెరువులో గాలించి మధు మృతదేహాన్ని వెలికితీశారు. అవివాహితుడైన యువకుడి మరణానికి కారణాలు తెలియరాలేదు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. మృతుడు రెండు నెలలుగా విధులకు హాజరు కావడంలేదని మున్సిపల్ కమిషనర్ రవీంద్రసాగర్ తెలిపారు.