
‘ఫ్యూచర్’ బాధిత రైతులను ఆదుకోవాలి
కందుకూరు: ఫ్యూచర్ సిటీలో భూములు కోల్పో యిన రైతులను అన్ని విధాలా ఆదుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య డిమాండ్ చేశారు. భూ బాధితుల పక్షాన పోరాటం చేయడానికి మంగళవారం జీపు జాతను ప్రారంభించారు. మండల పరిధిలోని ఆకులమైలారం, మీర్ ఖాన్‌పేట, బేగరికంచె, సార్లరావులపల్లి, సాయిరెడ్డిగూడ, ముచ్చర్లలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఫార్మాసిటీ పేరుతో అప్పటి సీఎం కేసీఆర్ 15 వేల ఎకరాలు సేకరించారని, అధికారంలోకి రాకముందు రేవంత్‌రెడ్డి ఫార్మాను రద్దు చేస్తామని చెప్పి, ఫ్యూచర్ సిటీ పేరుతో పోలీసులను అడ్డుపెట్టుకుని అదనంగా భూములు తీసుకుంటున్నారన్నారు. 2013 చట్టం ప్రకారం రైతులను సమావేశపరిచి, వారి సమ్మతి తోనే భూములు సేకరించాలన్నారు. ఫ్యూచర్ సిటీ గ్రామాల్లో ఈ నెల 27, 28 తేదీల్లో నిర్వహించే పాదయాత్రకు సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు, మాజీ ఎంపీ తమ్మినేని వీరభద్రం హాజరుకానున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడు డి.రాంచందర్, జిల్లా కమిటీ సభ్యులు జి.నరసింహ, అంజయ్య, మండల కార్యదర్శి బి.బాల్‌రాజ్, యాచారం కార్యదర్శి ఎ.నరసింహ, నాయకులు శ్రీనివాస్, నర్సింహ, శ్రీరాములు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
సీపీఎం జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య