సాక్షి, సిటీబ్యూరో: మెట్రో రెండో దశ ప్రాజెక్టుపైన కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. రెండో దశలో ప్రతిపాదించిన మొదటి 5 కారిడార్‌ల డీపీఆర్‌లపైన సంబంధిత మంత్రిత్వ శాఖల అధికారులు దృష్టి సారించారు. ఈ మేరకు హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రోరైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డితో పాటు అధికారుల బృందం రెండు రోజుల క్రితం ఢిల్లీలో పర్యటించింది. డీపీఆర్‌లలోని సాంకేతిక అంశాలపైన చర్చలు జరిగినట్లు తెలిసింది. వివిధ మార్గాల్లో చేపట్టనున్న కారిడార్‌లపై కేంద్ర అధికారులు తమ సందేహాలను నివృత్తి చేసుకునేందుకే హెచ్‌ఏంఆర్‌ఎల్ అధికారులతో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. మెట్రో రెండో దశలో ప్రభుత్వం మొదట 76.4 కిలోమీటర్లతో 5 కారిడార్‌ల నిర్మాణానికి ప్రణాళికలను రూపొందించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు 5 కారిడార్‌లపైన హెచ్‌ఏఎంఆర్‌ఎల్ సమగ్రమైన ప్రాజెక్టు నివేదికను తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వ ఆమోదంతో కేంద్రానికి అందజేసింది. కేంద్రం నుంచి ఆమోదం లభిస్తే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనుంది. సుమారు రూ.24 వేల కోట్ల అంచనాలతో రెండో దశలో మొదటి 5 కారిడార్‌లను ప్రతిపాదించారు. ఇది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ప్రాజెక్టు డీపీఆర్‌లలో సాంకేతిక అంశాలపైన చర్చలు సాధారణమైన అంశమేనని, కేంద్ర కేబినెట్ దీనిపైన దృష్టి సారించినప్పుడే కీలకమైన ముందడుగు పడ్డట్లుగా భావించాలని హెచ్‌ఏఎంఆర్‌ఎల్ అధికారి ఒకరు పేర్కొన్నారు.
ఏప్రిల్‌లో నార్త్, ఫ్యూచర్ సిటీల డీపీఆర్‌లు..
మరోవైపు నార్త్‌సిటీలో ప్యారడైజ్ నుంచి మేడ్చల్ వరకు, ప్యారడైజ్ నుంచి శామీర్‌పేట్ వరకు ప్రతిపాదించిన రెండు కారిడార్‌లతో పాటు, శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఫ్యూచర్‌సిటీలోని స్కిల్ యూనివర్సిటీ వరకు మెట్రో రెండో దశ ‘బి’ విభాగంలో ప్రతిపాదించిన కారిడార్‌లకే ఏప్రిల్‌లో డీపీఆర్‌లను ఖరారు చేసి రాష్ట్ర ప్రభుత్వ అనుమతికి పంపనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నెలాఖరుకే అందజేయాల్సి ఉండగా ప్రాజెక్టుపైన సర్వేలు, అధ్యయనాల దృష్ట్యా ఏప్రిల్‌లో డీపీఆర్‌లు పూర్తి చేసే అవకాశం ఉంది.‘బి’ విభాగంలో ప్యారడైజ్ నుంచి మేడ్చల్ వరకు 23 కిలోమీటర్లు, శామీర్‌పేట్ ఓఆర్‌ఆర్ వరకు 22 కిలోమీటర్లు, ఫ్యూచర్‌సిటీ కారిడార్ 41 కిలోమీటర్ల చొప్పున నిర్మించనున్న సంగతి తెలిసిందే. రెండో దశలో రెండు విభాగాలుగా మొత్తం 8 కారిడార్‌లలో 190.4 కిలోమీటర్ల వరకు మెట్రో సేవలు అందుబాటులోకి రానున్నాయి.
డీపీఆర్‌లపై స్పష్టత
ఢిల్లీలో ఎన్వీఎస్ రెడ్డి పర్యటన
సాంకేతిక అంశాలపై అధికారులతో చర్చలు
రెండోదశ మొదటి ఐ కారిడార్‌లలో 76.4 కిలోమీటర్లు
నార్త్, ఫ్యూచర్‌సిటీలపై వచ్చే నెలలో డీపీఆర్‌లు