
నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర కీలకం
కీసర: నేర నియంత్రణతో పాటు నేరుస్తులకు శిక్ష పడేలా చేయడంలో సీసీ కెమెరాల పాత్ర కీలకంగా మారిందని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు అన్నారు. కమిషనరేట్‌లోని 11 పోలీస్ స్టేషన్ల పరిధిలో ఏర్పాటు చేసిన 1460 సీసీ కెమెరాలను నాగారం మున్సిపాలిటీ పరిధిలోని ల్యాండ్ మార్క్ కన్వెన్షన్ హాల్‌లో ఆయన శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..మల్కాజిగిరి జోన్ పరిధిలో మొత్తం 1460 కెమెరాలు ఏర్పాటు చేశామని, ఇందులో 410 కెమెరాలను 17 కాలనీల్లో, ప్రధాన రహదారులు, జంక్షన్ల వద్ద ఏర్పాటు చేశామన్నారు. వీటి కోసం రూ.1.19 కోట్లు ఖర్చు చేశామని, రెండేళ్ల పాటు నిర్వహణ బాధ్యత కూడా సంబంధిత కాంట్రాక్టర్‌దేనని చెప్పారు. మిగిలిన 1050 కెమేరాలను 212 దేవాలయాల్లో ఏర్పాటు చేశామన్నారు. వీటితో పాటు 5260 కమ్యూనిటీ సీసీటీవీ కెమెరాలు, 93,061 నేను సైతం కెమెరాలు కలిసి మొత్తం 98,321 కెమెరాలను జియో ట్యాగింగ్ చేశామన్నారు. వీటన్నిటినీ కమాండ్ కంట్రోల్ రూమ్‌లో ప్రత్యేక బృందం నిరంతరం పరిశీలిస్తుందన్నారు. భద్రత, సురక్షితమే ధ్యేయంగా నిఘా నేత్రాలను ఆవిష్కరిస్తున్నామన్నారు. కోర్టులకు సాక్ష్యాధారాలను సమర్పించవలసి వచ్చినప్పుడు కెమెరాలు కీలక భూమిక వహిస్తున్నాయన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద పోలీస్ కమిషనరేట్‌గా మల్కాజిగిరి రాచకొండ కమిషనరేట్ ఉందన్నారు. కార్యక్రమంలో డీసీపీ పద్మజ, అదనపు డీసీపీ వెంకటరమణ, మల్కాజిగిరి ఏసీపీ చక్రపాణి, కుషాయిగూడ ఏసీపీ మహేష్ గౌడ్, ఐటీ సెల్ ఏసీపీ నరేందర్ గౌడ్, పోలీస్ ఇన్‌స్పెక్టర్లు, సబ్ ఇన్‌స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.
రాచకొండ సీపీ సుధీర్ బాబు