
‘భూ భారతి’తో సమస్యలు పరిష్కారం
కడ్తాల్: ‘రైతుల భూ సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం భూ భారతి రికార్డ్స్ ఆఫ్ రైట్స్ ఇన్ ల్యాండ్ చట్టాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఈ పోర్టల్ ద్వారా భూముల రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ ప్రక్రియ మరింత పారదర్శకం, సులభతరం కానుంది’అని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. ధరణి ఫోర్టల్ స్థానంలో, భూ భారతి పోర్టల్‌ను అమల్లోకి తెచ్చిన నేపథ్యంలో సోమవారం మండల కేంద్రం రైతు వేదికలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
జూన్ 2నుంచి అమలు
బీఆర్‌ఎస్ ప్రభుత్వం తెచ్చిన ధరణితో రైతులు ఇబ్బంది పడ్డారని తెలిపారు. వారి భూములను.. ఆ పార్టీ పెద్దలు, నాయకులు దోచుకున్నారని విమర్శించారు. సమస్యను బాధిత రైతులు నాటి ప్రభుత్వం తెచ్చినా పట్టించుకోలేదని పేర్కొన్నారు. వీటన్నింటిని గుర్తించిన కాంగ్రెస్ పార్టీ.. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు భూ భారతిని తెచ్చిందని వివరించారు. ఈ పోర్టల్‌ను రాష్ట్రంలోని మూడు మండలాల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయనున్నామని వెల్లడించారు. ప్రజల నుంచి వచ్చే సలహాలు, సూచనలతో పకడ్బందీగా జూన్ 2, 2025 రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నుంచి పూర్తి స్థాయిలో పోర్టల్ అమలు కానుందని స్పష్టంచేశారు. రైతులకు అన్ని విధాలుగా అర్థమయ్యేలా పోర్టల్ ఉంటుందన్నారు. కార్యక్రమంలో పీసీసీ సభ్యుడు శ్రీనివాస్‌గౌడ్, డీసీసీ అధికార ప్రతినిధి శ్రీనివాస్‌రెడ్డి, సింగిల్‌విండో డైరెక్టర్ వెంకటేశ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బీచ్యానాయక్, కిసాన్‌సెల్ మండల అధ్యక్షుడు బాలరాజు, నాయకులు జంగారెడ్డి, రాజేశ్, షాబుద్దీన్, బిక్కునాయక్, సేవ్యానాయక్, భానుకిరణ్, శ్రీకాంత్, వ్యవసాయ శాఖ అధికారులు, సిబ్బంది ఉన్నారు.
సులభతరం కానున్న రిజిస్ట్రేషన్లు
రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నుంచిపోర్టల్ అమలు
ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి