
పైలెట్‌పై గంపెడాశలు!
యాచారం: కూరగాయలు సాగు చేసే అన్నదాతలు పైలెట్ ప్రాజెక్టుపైనే గంపెడాశలు పెట్టుకున్నారు. ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తే మరింత ముందుకెళ్తామని చెబుతున్నారు. మహానగరానికి కూతవేటు దూరంలో ఉన్న యాచారం మండలంలోని మొండిగౌరెల్లి, గడ్డమల్లయ్యగూడ, చౌదర్‌పల్లి గ్రామాలు కూరగాయలు, ఆకుకూరల సాగుకు ప్రసిద్ధి. మూడింటిలో దాదాపు 1200 మందికి పైగా రైతులు కూరగాయలు, ఆకుకూరల సాగుపైనే ఆధారపడి జీవనోపాధి పొందుతున్నారు. బోరుబావుల్లో ఉన్న కొద్దిపాటి భూగర్భ జలాలను సద్వినియోగం చేసుకుంటూ టమాట, బెండ, చిక్కుడు, కాకర, వంకాయ, సొర, పుదీన, కొత్తిమీర, మెంతి, పుంటికూర తదితరాలను పండిస్తున్నారు. నిత్యం వాటిని ప్రైవేట్ వాహనాల్లో నగరంలోని మాదన్నపేట, సరూర్‌నగర్, ఎల్బీనగర్ మార్కెట్లకు తరలించి విక్రయిస్తారు.
కమిషన్‌తో మళ్లీ ఆశలు
రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్‌గా ముదిరెడ్డి కోదండరెడ్డి నియమితులైనప్పటి నుంచి స్థానిక రైతుల్లో ఆశలు చిగురించాయి. మొండిగౌరెల్లి, గడ్డమల్లయ్యగూడ, చౌదర్‌పల్లి గ్రామాలను పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేశారు. ఇందులో భాగంగా కూరగాయలు, ఆకుకూరల సాగును ప్రోత్సహించనున్నారు. రైతు కమిషన్ ద్వారా ఆ మూడు గ్రామాల్లోని రైతులకు నాబార్డు భాగస్వామ్యంతో కావాల్సిన సౌకర్యాలు కల్పించడానికి నిర్ణయించారు. వ్యవసాయ, ఉద్యాన, పట్టుపరిశ్రమల శాఖల ఆధ్వర్యంలోని అధికారుల బృందం అక్కడ ఏఏ సౌకర్యాలు కల్పిస్తే సాగుశాతం పెరుగుతుందో గుర్తించారు. మొదటి విడతగా 250 మంది అన్నదాతల నుంచి వ్యవసాయ పరికరాలు, యంత్రాలు, డ్రిప్పు, స్ప్రిక్లర్లు, పైపులైన్లు, నాణ్యమైన కూరగాయలు, ఆకుకూరల విత్తనాలు, నెట్ షెడ్లు, తేనె, పట్టుపరిశ్రమకు అందించేందుకు దరఖాస్తులు స్వీకరించారు. వీటి పంపిణీపై కమిషన్ శ్రద్ధ వహించనుంది. దీంతో స్థానిక కర్షకులు సంబర పడుతున్నారు.
మొండిగౌరెల్లి, చౌదర్‌పల్లి, గడ్డమల్లయ్యగూడ గ్రామాల్లో కూరగాయల సాగు
ఎంపిక చేసిన రైతు కమిషన్
రాయితీపై పరికరాలు, విత్తనాలు, ఎరువులు అందించేందుకు కసరత్తు

పైలెట్‌పై గంపెడాశలు!