
పోలీస్ పహారాలో ఫెన్సింగ్
యాచారం: మండలంలోని నక్కర్తమేడిపల్లిలో రెండోరోజు పోలీస్ పహారాలో ఫార్మాసిటీకి సేకరించిన భూముల సర్వే, ఫెన్సింగ్ పనులు కొనసాగాయి. కోర్టుల్లో కేసులు.. ప్లాట్ల సర్టిఫికెట్లకు కబ్జాలు చూపించకపోవడంతో గుర్రుగా ఉన్నవారు ఫెన్సింగ్ పనులు అడ్డుకోవాలని గురువారం రాత్రి గ్రామంలో దండోరా వేయించారు. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. శుక్రవారం అడిషనల్ డీసీపీ సత్యనారాయణ, ఇబ్రహీంపట్నం ఏసీపీ రాజు, ఇద్దరు ఏసీపీలు, 8 మంది సీఐలు, 15 మంది ఎస్‌ఐలు, 150 మంది ఇతర పోలీస్ సిబ్బంది సర్వే, ఫెన్సింగ్ పనుల వద్దకు చేరుకున్నారు. ముందు జాగ్రత్తగా నక్కర్తమేడిపల్లి–పల్లెచల్కతండా రోడ్డులో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. ఆ రోడ్డుపై రాకపోకలు సాగించే వారి వాహనాలను తనిఖీ చేసి పంపించారు. గ్రామంలోని వాటర్ ట్యాంకు వద్ద మరో పికెట్ ఏర్పాటు చేసి గ్రామంలోని రైతులెవరినీ ఫార్మాసిటీ భూముల్లోకి రానివ్వలేదు. ఆందోళనకారుల కదలికలపై నిఘా పెట్టారు. రెండు రోజులుగా ఫార్మాసిటీకి సేకరించిన భూముల చుట్టూ దాదాపు నాలుగు కిలోమీటర్ల మేర ఫెన్సింగ్ పనులు పూర్తి చేశారు.
రెండో రోజు కొనసాగిన ఫార్మాసిటీ భూముల సర్వే, కంచె ఏర్పాటు పనులు
రైతులకు మద్దతుగా ఉంటాం
ఫార్మాసిటీ రైతులకు మద్దతుగా ఉంటాం, బలవంతంగా ఫార్మా భూములపైకి వెళ్తే ఊరుకునే ప్రసక్తే లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రెండు రోజులుగా నక్కర్తమేడిపల్లిలో భారీ పోలీస్ బందోబస్తు మధ్య సర్వే, ఫెన్సింగ్ వేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ఎకరాకు 121 గజాల ప్లాట్ల సర్టిఫికెట్లు ఇచ్చి నాలుగేళ్లు గడుస్తున్నా నేటికీ స్థలాలు చూపించకపోగా రైతుల భూములను స్వాధీనం చేసుకోవడం చట్టరీత్యానేరమన్నారు. అధికారంలోకి వస్తే ఫార్మాసిటీని రద్దు చేసి భూములను రైతులకు తిరిగిచ్చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ సర్కార్‌ను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు.