పేరు గొప్ప.. ఊరు దిబ్బ.. అలా ఊగిపోతారంతే..! | In AP Politics: Frustration Care Of JC Brothers | Sakshi
Sakshi News home page

పేరు గొప్ప.. ఊరు దిబ్బ.. అలా ఊగిపోతారంతే..!

Published Sat, Nov 12 2022 11:54 AM | Last Updated on Sat, Nov 12 2022 1:10 PM

In AP Politics: Frustration Care Of JC Brothers - Sakshi

ఆయనో సీనియర్ రాజకీయ నాయకుడు. ఒక నియోజకవర్గంలో దశాబ్దాలుగా చక్రం తిప్పినా.. గత ఎన్నికల్లో పరాజయం చెందారు. తనకు రాజకీయంగా సమాధి తప్పదని కుమిలిపోతున్న ఆ నేత.. ఇప్పుడు కనిపించిన వారందరిపైనా తన ఫ్రస్ట్రేషన్ చూపిస్తున్నారు. కావాలనే వివాదాలు సృష్టించుకుంటూ  అభాసుపాలవుతున్నారు. 

పేరు గొప్ప.. ఊరు దిబ్బ
అనంతపురం జిల్లాలో జేసీ బ్రదర్స్‌ పేరు తెలియనివారుండరు. సోదరులిద్దరూ రాష్ట్రంలో కాంగ్రెస్ పతనం తర్వాత పచ్చపార్టీలో చేరి క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. జేసీ దివాకరరెడ్డి రాష్ట్ర మంత్రిగా, ఎంపీగా జిల్లా రాజకీయాలను శాసిస్తే.. తమ్ముడు ప్రభాకరరెడ్డి మాత్రం లోకల్‌గానే తన ప్రతాపం చూపించేవారు. నాలుగు దశాబ్దాలుగా వీరిద్దరూ జిల్లా రాజకీయాల్లో కీలకంగా ఉన్నారు. గత ఎన్నికల్లో జేసీ దివాకర్ రెడ్డి బరిలో లేకపోవడంతో.. తాడిపత్రి అసెంబ్లీ స్థానం నుంచి తన కొడుకు అస్మిత్ రెడ్డి తో పోటీ చేయించారు జేసీ ప్రభాకర్ రెడ్డి. కొడుకు ఓటమి..తనకు వయోభారంతో పాటు గతంలో చేసిన అవినీతి, అక్రమాలకు సంబంధించిన కేసులు జేసీ ప్రభాకర్ రెడ్డి మెడకు చుట్టుకుని గిలగిల్లాడుతున్నారు. జేసీ ట్రావెల్స్ ఫోర్జరీ కేసుల్లో 33 ఛార్జిషీట్లను, ఆధారాలతో సహా పోలీసులు కోర్టులో సమర్పిస్తున్నారు. దీంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న జేసీ ప్రభాకర్ రెడ్డి... తన ఫ్రస్ట్రేషన్ అంతా చుట్టూ ఉన్నవారిపైన చూపుతున్నారు.

అలా ఊగిపోతారంతే..!
ఇటీవలే తాడిపత్రిలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటును వ్యతిరేకించి అభాసుపాలైన జేసీ ప్రభాకర్ రెడ్డి... ఇప్పుడు అనంతపురం జిల్లా కలెక్టర్ నాగలక్ష్మిపై దురుసుగా ప్రవర్తించి ప్రభుత్వ ఉద్యోగుల ఆగ్రహానికి గురయ్యారు. అనంతపురం కలెక్టరేట్‌లో ఓ వినతి పత్రాన్ని అందజేసేందుకు వచ్చిన జేసీ ప్రభాకర్ రెడ్డి.. సమస్యను చెప్పకుండానే.. కలెక్టర్ నాగలక్ష్మి పై అనుచితంగా ప్రవర్తించారు. ఆవేశం ఊగిపోతూ.... బీకేర్ ఫుల్ అంటూ కలెక్టర్ నాగలక్ష్మికి వార్నింగ్ ఇచ్చాడు జేసీ. అంతటితో ఆగక.. గన్ మెన్ ను తోసేసి దాడికి యత్నించారు. అత్యంత సహనంతో వ్యవహరించిన కలెక్టర్ నాగలక్ష్మి పెద్దమనసుతో జేసీని క్షమించారు. ఆయన దురుసు ప్రవర్తనపై ఇప్పటిదాకా కలెక్టర్ ఎలాంటి ఫిర్యాదు ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి రౌడీయిజంపై ఉద్యోగ సంఘాలు భగ్గుమన్నాయి. జేసీ క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. లేకపోతే జేసీకి తెగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. గతంలోనూ ఓ రవాణా శాఖ కార్యాలయంలో కూడా ఉన్నతాధికారులపై జేసీ ప్రభాకర్ రెడ్డి ఇలాగే వ్యవహరించారు.

పప్పులు ఉడకలేదు మరీ.!
రాజకీయ ప్రత్యర్ధులపై భౌతిక దాడులు చేయించటం.. తనకు అనుకూలంగా వ్యవహరించని పోలీసు అధికారులపై ప్రైవేటు కేసులు పెట్టించటం.. బెదిరించి పనులు చేయించుకోవటం జేసీ ప్రభాకర్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య. గతంలో పోలీసు స్టేషన్ కు వెళ్లి సీఐ, ఎస్సై లను బెదిరించి తన మనుషులను విడిపించుకెళ్లిన చరిత్ర కూడా ఉంది. జేసీ ప్రభాకర్ రెడ్డి పై అనేక క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. తాడిపత్రి నియోజకవర్గంలో ముక్కుసూటిగా విధులు నిర్వహిస్తూ.. పార్టీలకు అతీతంగా వ్యవహరిస్తున్న డీఎస్పీ చైతన్యను టార్గెట్ చేశారు. డీఎస్పీపై ఇరవైకి పైగా ప్రైవేటు కేసులను జేసీ ప్రభాకర్ రెడ్డి పెట్టించారు. ఈయన వ్యవహార శైలిపై సొంత పార్టీ లోనూ వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

బాబు కనుసన్నల్లోనే బ్లాక్ మెయిల్
జేసీ ప్రభాకర్ రెడ్డి దౌర్జన్యాల వల్ల అందరికీ చెడ్డపేరు వస్తుందని పలువురు టీడీపీ నేతలు వాపోతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ నిర్వీర్యమయ్యాక గత్యంతరం లేక టీడీపీలో చేరిన ప్రభాకర్ రెడ్డి అవినీతి.. అక్రమాలు.. దౌర్జన్యాలు, బ్లాక్ మెయిల్ రాజకీయాలు చంద్రబాబుకు తెలిసినా చూసీ చూడనట్లుగా వ్యవహరిన్నారని అనంతపురం టీడీపీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement