
(సంగారెడ్డి): అగ్నిసాక్షిగా పెళ్లి జరిగి నెలరోజులే అయ్యింది. చిన్న బంగారం గొలుసు పోయిందని భర్త పంచాయితీతో ఆమె మనోవేదనకు గురైంది. ఏం జరిగిందో ఏమో తెలియదుగానీ రేకుల ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం... సదాశివ పేట మండలం రేండ్లపల్లి గ్రామానికి చెందిన కొలుకూరి లక్ష్మి కూతురు అఖిల (19) వివాహం హత్నూర మండలం పన్యాల గ్రామానికి చెందిన నీరుడి భాగయ్యతో గత నెల ఏడో తేదీన జరిగింది. నాలుగు రోజుల క్రితం ఇస్రాలాబాద్ గ్రామంలో బంధువుల ఇంటికి అఖిల వెళ్లింది.
భర్త భాగయ్య బంగారు గొలుసు కనిపించడం లేదని భార్య అఖిలకు ఫోన్ చేశారు. తాను తీసుకెళ్లలేదని బదులిచ్చింది. దీంతో అఖిలను బంధువుల ఇంటి భర్త భాగయ్య బుధవారం పన్యాలకు తీసుకొచ్చాడు. అత్తింటివారు మందలించారో తెలియదుగానీ గురువారం సాయంత్రం అత్తగారింట్లో అఖిల మృతదేహం వేలాడుతూ కనిపించింది. దీంతో భర్త భాగయ్య, కుటుంబీకులు మృతదేహాన్ని మంచంపై పండబెట్టారని గ్రామస్తులు తెలిపారు.
ఆత్మహత్య చేసుకుందా, లేకపోతే హత్య చేశారో తెలియదు. విషయం తెలుసుకున్న జిన్నారం సీఐ వేణుకుమార్, ఎస్‌ఐ లక్ష్మారెడ్డిలు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. పన్యాల గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. బంగారం కోసమే తన కూతురిని హత్య చేశారని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు.
భర్త వేధింపులతోనే ఆత్మహత్య: ఎస్‌ఐ
బంగారం గొలుసు తీశావని భర్త వేధింపులతోనే అఖిల ఆత్మహత్య చేసుకుందని ఎస్‌ఐ లక్ష్మారెడ్డి తెలిపారు. భర్త వేధించడం వల్ల అవమానం భరించలేక అఖిల ఆత్మహత్య చేసుకున్నట్టు రాసిన సూసైడ్ నోట్ కూడా దొరికిందని ఎస్‌ఐ తెలిపారు. మతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు కొనసాగిస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.