
జిల్లా ఎస్పీగా పంకజ్ పరితోష్
చెన్నూరి రూపేశ్ నార్కోటిక్ బ్యూరోకు బదిలీ
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: జిల్లా ఎస్పీగా పంకజ్ పరితోష్ నియమితులయ్యారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఓఎస్‌డీగా పనిచేస్తున్న పంకజ్‌ను జిల్లా ఎస్పీగా బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక్కడ ఎస్పీగా పనిచేస్తున్న చెన్నూరి రూపేశ్‌ను యాంటీ నార్కోటిక్ బ్యూరో ఎస్పీగా బదిలీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 21 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా జిల్లా ఎస్పీకి బదిలీ అయింది.
2020 బ్యాచ్‌కు చెందిన
ఐపీఎస్ అధికారి..
పంకజ్ 2020 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి. భద్రాచలం అదనపు ఎస్పీగా మొదటి పోస్టింగ్‌లో చేరారు. ఆ తర్వాత ఆయన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఓఎస్‌డీగా బదిలీ అయ్యారు. యాంటీ నక్సల్స్ ఆపరేషన్స్‌లో పంకజ్‌కు మంచి పట్టుంది. జిల్లా ఎస్పీగా పనిచేయడం ఆయనకు ఇదే తొలిసారి. దేశంలోనే ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో ఒకటైన ఐఐటీ విద్యార్థి.
పాలనపై చెన్నూరి రూపేశ్ తనదైన ముద్ర
జిల్లా పోలీసు పాలనపై రూపేశ్ తనదైన ముద్ర వేసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జరిగిన బదిలీల్లో భాగంగా 2023 అక్టోబర్ 13 ఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. సుమారు ఏడాదిపైన ఐదు నెలల పాటు జిల్లాలో పనిచేశారు. రూపేశ్ నార్కోటిక్ అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపారు. ఎస్–నాబ్ విభాగాన్ని బలోపేతం చేసి గంజాయి అక్రమ రవాణాపై ప్రధానంగా దృష్టిపెట్టారు. అలాగే నిషేధిత మత్తు పదార్థం అల్ఫ్రాజోలం తయారీ ముఠాల గుట్టు రట్టు చేశారు. ఆల్ఫ్రాజోలం తయారీ ముఠాలకు సంబంధించిన రూ.కోట్లు విలువ చేసే ఆస్తులను జప్తు చేయించారు. అక్రమ మద్యం, నిషేధిత సిగరెట్ల దందాకు చెక్‌పెట్టగలిగారు. మరోవైపు పోలీసు ఉద్యోగుల సంక్షేమంపై కూడా ఆయన దృష్టి సారించారు. సీఎస్‌ఆర్ నిధులతో సొసైటీ ఫర్ సంగారెడ్డి సెక్యురిటీ కౌన్సిల్‌ను ఏర్పాటు చేసి పారిశ్రామిక వాడల్లో మెరుగైన పోలీసు సేవలు అందించేందుకు చర్యలు చేపట్టారు. మై ఆటో సేఫ్, ట్రాఫిక్ బైక్‌లు వంటి వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.
బయోడేటా : పేరు: పంకజ్ పరితోష్
స్వస్థలం : బిహార్ రాష్ట్రం
భోజ్‌పూర్ జిల్లా ఆరానగర్.
తల్లిదండ్రులు : పంకజ్ తండ్రి డా.నరేంద్రనారాయణసింగ్ రిటైర్డ్ ప్రొఫెసర్.తల్లి డా.కృతిసింగ్ కూడా పీహెచ్‌డీ చేశారు.
పుట్టిన తేదీ : 1989 అక్టోబర్ 19.
సివిల్ సర్వీసెస్ ర్యాంక్ : 142(2019 సంవత్సరం)
ఉద్యోగం : జర్మనీలోని మర్చంట్ నేవీ ఉద్యోగం (2015 వరకు)
ఐపీఎస్‌గా ఎంపిక : 2020 డిసెంబర్ 28
పోలీసుశాఖలో : వరంగల్ జిల్లా రఘునాథపల్లి ఎస్‌హెచ్‌ఓగా 2022లో పనిచేశారు. ఆ తర్వాత గ్రేహౌండ్స్ విభాగం హైదరాబాద్‌లో విధులు నిర్వహణ. 2023 జనవరి 29న భద్రాచలం ఎఎస్పీగా బాధ్యతల స్వీకరణ. 2024 జూలై నుంచి ఇప్పటివరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఓఎస్డీగా నియామకం.

జిల్లా ఎస్పీగా పంకజ్ పరితోష్
Comments
Please login to add a commentAdd a comment