
అమ్మాయి చదువు ఇంటికి వెలుగు
● కలెక్టర్ వల్లూరు క్రాంతి ● కలెక్టరేట్‌లో ఘనంగా మహిళా దినోత్సవం
సంగారెడ్డి జోన్: అమ్మాయిల చదువు ఇంటికి ఎంతో వెలుగని కలెక్టర్ వల్లూరు క్రాంతి పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం కలెక్టరేట్‌లో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. అనంతరం మహిళా ఉద్యోగులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ...మహిళల సమానత్వం మన ఇంటి నుంచే ప్రారంభం కావాలన్నారు. ఇంట్లో ఆడపిల్లలను, మగ పిల్లలను సమానంగా చూసి, చదివించాలని సూచించారు. మహిళలు అన్ని రంగాలలో పురోగమించడమే అసలైన అభివృద్ధి అని తెలిపారు. ప్రభుత్వ ,ప్రైవేటు రంగాలలో మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ మహిళల సంఖ్య ఇంకా పెరగాల్సిన అవసరం ఉందన్నారు. ఉద్యోగం చేయాలంటే కుటుంబ సభ్యులకు ప్రోత్సాహం చాలా అవసరం అన్నారు. కార్యక్రమంలో డీఆర్‌వో పద్మజారాణి, జిల్లా సంక్షేమ శాఖ అధికారి లలిత కుమారి, పీడీ డీఆర్డీఏ జ్యోతి, జిల్లా పశుసంవర్థకశాఖ అధికారి వసంతకుమారి, వివిధ శాఖల మహిళా ఉద్యోగులు, మహిళా సంఘాలు, విద్యార్థులు, పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment