
తల్లి దశ దిన కర్మ రోజే కొడుకు మృతి
కొండపాక(గజ్వేల్): తల్లి దశ దిన కర్మ రోజున కొడుకు విద్యుదాఘాతానికి గురై మృతి చెందిన ఘటన కుకునూరుపల్లి మండలంలోని మంగోల్ గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామంలో ముదిరాజ్ కులానికి చెందిన కొండ సత్తవ్వ దశ దిన కర్మను కుటుంబీకులు కుల సంఘం భవనంలో నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో పనుల్లో నిమగ్నమైన కొడుకు కొండ కృష్ణ (27) కుల సంఘం భవనానికి ఎదురుగా ఉన్న ఇంట్లో బట్టలు ఆరవేస్తున్నాడు. దీంతో విద్యుత్తు షాక్ తగిలి కిందపడటంతో తలకు బలమైన గాయాలై అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. వెంటనే గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారు. మృతుడు తిప్పారం గ్రామ శివారులోని కోళ్లఫాంలో కూలీ పనులు చేస్తూ అందరితో కలుపుగోలుగా ఉండే వాడు. గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి.