పాపన్నపేట(మెదక్): డ్రంకై న్ డ్రైవ్ కేసుకు కారకుడయ్యాడన్న కోపంతో తోటి మిత్రులే యువకుడిని కొట్టి హత్య చేశారని మెదక్ రూరల్ సీఐ జీ.రాజశేఖర్ రెడ్డి, పాపన్నపేట ఎస్సై సార శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. 10న ఏడుపాయల వద్ద వెలుగు చూసిన హత్యకేసును పోలీసులు ఛేదించి సోమవారం వివరాలు వెల్లడించారు. పాపన్నపేట మండలం రామతీర్థం గ్రామానికి చెందిన వడ్ల నవీన్ సంగారెడ్డి లోని ఓ బేవరేజ్ కంపెనీలో పని చేసే సమయంలో తొగర్‌పల్లికి చెందిన వినోద్ రెడ్డి, సంగారెడ్డికి చెందిన బేగరి రాములు, కుమ్మరి రమణాచారి స్నేహితులయ్యారు. సంగారెడ్డిలో గత నెల 18న నలుగు రు స్నేహితులు మద్యం సేవించి వెళ్తూ పోలీసుల డ్రంకై న్ డ్రైవ్ టెస్టులో దొరికారు. నవీన్ పోలీసులను బతిమాలుతుండగా, వినోద్ రెడ్డి వారితో దురుసుగా ప్రవర్తించారు. దీంతో పోలీసు లు కేసు నమోదు చేశారు. కోర్టు జరిమానా, ఇతర ఖర్చులను నవీన్ భరించాడు. అప్పటి నుంచి వినోద్ రెడ్డి పై మిత్రులు కక్ష పెంచుకున్నారు. ముందస్తు ప్లాన్ ప్రకారం ఈనెల 8న ముగ్గురూ కలిసి వినోద్ రెడ్డిని తీసుకొని ఏడుపాయల్లో దావత్ చేసుకుందామని తీసుకెళ్లారు. ఏడుపాయల్లో మందు కొనుగోలు చేసి మునిపుట్ట వద్ద తాగారు. అప్పటికే కోపంతో ఉన్న నవీన్ కట్టెతో వినోద్ రెడ్డిపై దాడి చేశాడు. అతడితోపాటు బేగరి రాములు, కమ్మరి రమణాచారి విచక్షణారహితంగా కొట్టడంతో చనిపోయాడు. అనంతరం నిందితులు నవీన్ ఇంటికొచ్చి డబ్బులు తీసుకొని పారిపోయారు. మృతుడి సోదరుడు విష్ణు వర్ధన్ రెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈనెల 8న సంగారెడ్డిలో నలుగురూ కలిసి ఉన్న విషయాన్ని తెలుసుకున్నారు. కొంత మంది సాక్షు లు ఇచ్చిన సమాచారం మేరకు నిందితులని పట్టుకొని రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు ఎస్సీ ఉదయ్ కుమార్ రెడ్డి, డీఎస్పీ ప్రసన్న కుమార్ పోలీసులను అభినందించారు.
వీడిన యువకుడి హత్య కేసు మిస్టరీ
ముగ్గురు నిందితుల రిమాండ్