దుబ్బాక : రాయపోల్–తిమ్మక్కపల్లి గ్రామాల మధ్యనున్న గల్వని చెరువు ప్రాంతంలో చిరుత పులి సంచరిస్తుందన్న సమాచారంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. రాయపోల్–తిమ్మక్కపల్లి గ్రామాల రైతులకు మంగళవారం గల్వనిచెరువు ప్రాంతంలో చిరుత పులి కనిపించింది. చిరుతపులి తిరుగుతున్న ఫొటోలను పలువురు రైతులు దూరం నుంచి సెల్‌ఫోన్‌లో తీసి పలు గ్రూపుల్లో షేర్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న ఎస్‌ఐ రఘుపతి వెంటనే అక్కడికి చేరుకొని ఫారెస్టు అధికారులకు సమాచారం ఇచ్చారు. ఆ ప్రాంతంలో సంచరిస్తుంది చిరుతనా..? లేక మరో జంతువా.. అన్నది ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. అనంతరం ఎస్‌ఐ మాట్లాడుతూ.. చిరుతపులి సంచరిస్తున్న నేపథ్యంలో రాయపోల్, తిమ్మక్కపల్లి గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. చిరుతపులి కనిపిస్తే వెంటనే అటవీశాఖ అధికారులు లేదా పోలీసులకు సమాచారం అందించాలన్నారు. చిరుతపులి సంచారం వార్త రాయపోల్, తిమ్మక్కపల్లి గ్రామాల్లో తీవ్ర కలకలం లేపింది. ఆ ప్రాంతంలోని వ్యవసాయ పొలాలకు వెళ్లాలంటేనే రైతులు భయపడుతున్నారు.
రాయపోల్–తిమ్మక్కపల్లి శివారులో చూసిన రైతులు
భయాందోళనకు గురవుతున్న ప్రజలు