బావిలో పడి రైతు..
మద్దూరు(హుస్నాబాద్): ప్రమాదవ శాత్తు వేర్వేరు ఘటనల్లో నలుగురు మృతి చెందారు. వరి పొలానికి వరుస తడి పారించేందుకు వెళ్లిన రైతు బావిలో శవమై కనిపించాడు. ఈ ఘటన మద్దూరు మండలం వల్లంపట్ల గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. ఎస్సై షేక్ మహబూబ్ కథనం ప్రకారం... గ్రామానికి చెందిన వంగపల్లి నర్సింహులు(47) ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందాడు. తన పొలంలో సాగు చేసిన వరికి వరుస తడి పారించేందుకు రాత్రి వెళ్లి ఉదయమైనా ఇంటికీ రాలేదు. దీంతో కుటుంబసభ్యులు వెళ్లి పొలం వద్ద వెతకగా బావిలో శవమై కనిపించాడు. మృతుడికి భార్య లక్ష్మి, కుమారు, కుమార్తె ఉన్నారు. భార్య ఫిర్యాదు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
విద్యుదాఘాతంతో కౌలు రైతు..
పాపన్నపేట(మెదక్): స్టార్టర్ డబ్బా విప్పే క్రమంలో సర్వీస్ వైర్ నుంచి విద్యుత్ సరఫరా జరిగి ఓ కౌలు రైతు మృతి చెందిన ఘటన పాపన్నపేటలో ఆదివారం జరిగింది. ఎస్సై శ్రీనివాస్ గౌడ్ కథనం ప్రకారం... గ్రామానికి చెందిన బట్టి బాలయ్య (57) ఓ వ్యక్తికి చెందిన పొలం కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు. బోరు మోటర్ కాలిపోవడంతో మెకానిక్ దగ్గరకు తీసుకెళ్లాడు.అనంతరం స్టార్టర్ డబ్బా తీసుకెళ్లే ప్రయత్నంలో దాన్ని ముట్టుకోవడంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మరణించాడు. అటుగా వెళ్లిన వారు గమనించి కుటుంబీకులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా మృతుడికి భార్య కిష్టమ్మ, ముగ్గురు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు.
స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లిన బాలుడు..
పాపన్నపేట(మెదక్): సరదాగా స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లిన బాలుడు నీట మునిగి మరణించిన ఘటన పాపన్నపేట మండలంలో ఆదివారం వెలుగు చూసింది. మల్లంపేట గ్రామానికి చెందిన కుర్మ సాయిలు కుమారుడు దుర్గయ్య(12) బడికి వెళ్లకుండా, వ్యవసాయంలో తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటున్నాడు. శనివారం మధ్యాహ్నం స్నేహితులతో కలిసి రెడ్ల చెరువులో స్నానం చేసేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో నీటిలో మునిగాడు. తోటి స్నేహితులు ఈ విషయాన్ని గ్రామస్తులకు తెలుపగా, శనివారం సాయంత్రం చెరువులో వెతికినప్పటికీ ఆచూకీ దొరక లేదు. దీంతో తిరిగి ఆదివారం చెరువులో గాలించగా, దుర్గయ్య మృతదేహం దొరికింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
సాయం చేయబోయి చెరువులో మునిగి..
జగదేవ్‌పూర్(గజ్వేల్): పెంపుడు కుక్కలకు సాన్నం చేయించేందుకు చెరువుకు వెళ్లి బాలుడు నీట మునిగి మృత్యువాత పడిన ఘటన మండలంలోని మందాపూర్ గ్రామంలో ఆదివారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... గ్రామానికి చెందిన నిమ్మల ఆరవింద్(17) అనే బాలుడు పదో తరగతి పూర్తి చేసి ఇంటి వద్దే పనులు చేస్తున్నాడు. కాగా ఆదివారం పెంపుడు కుక్కలను గ్రామంలోని బతుకమ్మ చెరువులో స్నానం చేయించేందుకు తీసుకెళ్లాడు. అప్పటికే గ్రామానికి చెందిన లింగాల వెంకటయ్య చేపలు పట్టడానికి చెరువులో వల వేసి ఉంచాడు. వెంకటయ్య చేపల వలను లాగమని అరవింద్‌కు చెప్పడంతో చెరువులోకి దిగి వలను లాగే ప్రయత్నంలో నీటిలో మునిగాడు. వెంటనే గ్రామస్తులకు, కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. వెంటనే వారు చెరువు వద్దకు చేరుకొని అరవింద్‌ను చెరువులో నుంచి బయటకు తీయగా అప్పటికే మృతి చెందాడు.పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్‌ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వెంకటయ్య నిర్లక్ష్యం వల్లే తన కొడుకు మృతి చెందాడని మృతుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ప్రమాదవశాత్తు నలుగురు మృతి
ప్రమాదవశాత్తు నలుగురు మృతి
ప్రమాదవశాత్తు నలుగురు మృతి