బెజ్జంకి(సిద్దిపేట): జాతీయ స్థాయి అండర్ 19 హ్యాండ్ బాల్ పోటీలకు బెజ్జంకి మండల కేంద్రానికి చెందిన బొనగిరి అరవింద్ ఎంపికై నట్లు హ్యాండ్ బాల్ జిల్లా కార్యదర్శి మల్లేశం కుటుంబ సభ్యులు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. అరవింద్ హైదరాబాద్‌లో ఇంటర్మీడియట్ పూర్తి చేసి పారామెడికల్ చదువుతున్నాడు. జనవరి 18న కరీంనగర్‌లో జరిగిన రాష్ట్ర స్థాయి అండర్ 19 పోటీల్లో ప్రతిభ కనబరిచిన అరవింద్ జాతీయ జట్టుకు ఎంపికయ్యారు. నేటి నుంచి బీహార్‌లోని జెహనాబాద్‌లో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొననున్నట్లు పేర్కొన్నారు. అరవింద్‌ను రాష్ట్ర అడ్వైజర్ కమిటీ సభ్యులు కనుకయ్య, బెజ్జంకిలోని ఆర్‌వీఎంబీపీ అకాడమీ సభ్యులు రవి, మధు, డీవీరావు అభినందించారు.
ఏఐలో విద్యార్థిని ప్రతిభ
● గూగుల్‌లో రీసెర్చ్ పత్రాలు
● అమెజాన్‌లో సైతం
పుస్తక రూపంలో స్థానం
కోహెడ(హుస్నాబాద్): కోహెడ మండల కేంద్రానికి చెందిన ఎండీ తన్వీర్ సుల్తానా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ రీసెర్చ్‌లో ప్రతిభ కనబర్చారు. అమెరికాలోని మిస్సోరి విశ్వవిద్యాలయంలో కంప్యూటర్ సైన్స్ విభాగంలో సుల్తానా పీహెచ్‌డీ చేస్తున్నారు. ఈ క్రమంలో కృత్రిమ మేధ (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్)లో మిషన్ లెర్నింగ్ ఇన్ కంప్యూటర్ నెట్‌వర్క్ అనే అంశంపై రీసెర్చ్ చేశారు. వాషింగ్టన్‌లో జరిగిన పదవ ఐఈఈఈ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ సదస్సులో విద్యార్థిని చేపట్టిన రీసెర్చ్ పత్రాలను పరిశీలించారు. ప్రాముఖ్యత దృష్ట్యా గూగుల్‌లో స్థానం కల్పించినట్లు తెలిపారు. రీసెర్చ్ పత్రాలన్నీ పుస్తక రూపంలో అమెజాన్‌లో సైతం స్థానం పొందినట్లు చెప్పారు. ఈ సందర్భంగా భవిష్యత్‌లో ఉన్నత శిఖరాలకు ఎదగాలని గ్రామస్తులు ఆకాంక్షించారు.
ఎమ్మార్పీఎస్ ఉమ్మడి జిల్లా
మాజీ అధ్యక్షుడి మృతి
పాడె మోసిన మంద కృష్ణ మాదిగ
నంగునూరు(సిద్దిపేట): ఎమ్మార్పీఎస్ ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షుడు నంగునూరు మండలం నర్మేటకు చెందిన గందమల్ల యాదగిరి (40) మంగళవారం అనారోగ్యంతో మృతి చెందారు. ఎస్సీ వర్గీకరణ కోసం అనేక ఉద్యమాల్లో పాల్గొన్న యాదగిరి జిల్లా వ్యాప్తంగా ఎమ్మార్పీఎస్ బలోపేతానికి కృషి చేశారు. ఆయన సేవలను గుర్తించిన మంద కృష్ణ మాదిగ యాదగిరిని మెదక్ జిల్లా అధ్యక్షుడిగా నియమించారు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతూ మృతి చెందాడు. విషయం తెలుసుకున్న మందకృష్ణ మాదిగ యాదగిరి కుటుంబాన్ని ఓదార్చారు. ఈ సందర్భంగా నివాళులర్పించి డప్పు కొట్టి పాడె మోస్తూ అంత్యక్రియల్లో పాల్గొన్నాడు. యాదగిరి పెద్ద కూతురు శ్రీచందన నర్మేట ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతూ ప్రస్తుతం పరీక్షలు రాస్తోంది. ఇంటికి పెద్ద దిక్కును కోల్పోయిన నిరుపేద కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.
జాతీయ స్థాయి హ్యాండ్‌బాల్ పోటీలకు బెజ్జంకి విద్యార్థి