
చికిత్స పొందుతూ యువకుడు మృతి
అల్లాదుర్గం(మెదక్): ఆత్మహత్యకు పాల్పడిన యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఎస్‌ఐ ప్రవీణ్‌రెడ్డి కథనం మేరకు.. అల్లాదుర్గం గ్రామానికి చెందిన కుమార్(28) పంచాయతీ కార్యాలయంలో తాత్కాలిక కారోబార్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. తనకు వచ్చే కొద్ది పాటి వేతనంతో కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వేతనం సరిపోక సమయానికి రాకపోవడంతో ఆర్థిక ఇబ్బందులకు గురయ్యాడు. దీంతో మనస్తాపం చెంది 21న ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడగా వెంటనే జోగిపేట ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో హైద్రాబాద్ ఉస్మానియాకి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారు జామున మృతి చెందినట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతుడి తమ్ముడు పోచయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
రాంచంద్రాపూర్‌లో మరో యువకుడు
కోహెడరూరల్(హుస్నాబాద్): ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ మండలంలోని రాంచంద్రాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన సుంకరి నాగయ్య గొర్రెల కాపరిగా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కుమారుడు సుంకరి ప్రశాంత్(19) కొద్దిరోజులుగా ఏం పని చేయకుండా ఖాళీగా ఇంట్లో ఉంటున్నాడు. దీంతో తండ్రి మందలించాడు. మనస్తాపానికి గురైన ప్రశాంత్ వారం రోజుల కిందట క్రిమిసంహరక మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు కరీంనగర్‌లోని ఓ ప్రవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు.