సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు చుక్కా రాములు
సంగారెడ్డి ఎడ్యుకేషన్: ప్రజా వ్యతిరేకమైన ప్యారానగర్ డంపింగ్ యార్డ్ రద్దు చేయాల్సిందేనని, రేవంత్‌రెడ్డి సర్కార్ ప్రజా ప్రభుత్వం అంటూనే ప్రజల గోడు పట్టించుకోరా అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు చుక్కా రాములు ప్రశ్నించారు. ప్యారానగర్ డంపింగ్ యార్డు వ్యతిరేక పోరాటానికి మద్దతుగా గురువారం సీపీఎం సామూహిక నిరహార దీక్షలను ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు చుక్కా రాములు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ప్రజా ఉద్యమాలను నిర్బంధాలతో అణచివేయాలని చూస్తే ప్రజలు మరింత తిరగబడతారని హెచ్చరించారు. స్థానిక ప్రజల అభిప్రాయాలకు భిన్నంగా ఏకపక్షంగా డంపింగ్‌యార్డ్ పెట్టాలని నిర్ణయించడం సరైంది కాదన్నారు. డంపింగ్ యార్డ్‌ను రద్దు చేయాలని కోరుతూ ప్రజలు పోరాడుతున్నందున వాస్తవ పరిస్థితులను గమనించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాల్సిన బాధ్యత కలెక్టర్‌పై ఉందన్నారు. ఇప్పటికే పరి శ్రమలు వెదజల్లే కాలుష్యం వల్ల జిన్నారం, బొంతపల్లి,పటాన్‌చెరు ప్రాంతమంతా పరిసరాలు, పర్యావరణం దెబ్బతినడం వల్ల అక్కడ ప్రజలు జీవించలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం డంపింగ్ యార్డును రద్దు చేయాలని కోరుతూ కలెక్టరేట్ ఏఓకు వినతి పత్రం అందజేశారు.