చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
నారాయణఖేడ్: రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లను సద్వినియోగం చేసుకొని ఉద్యోగ, ఆర్థిక, రాజకీయంగా ఎదగాలని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు. గురువారం మనూరు మండలం కమలాపూర్‌లో దళిత రాష్ట్ర నేత నల్లా సూర్యప్రకాశ్ సహకారంతో నూతనంగా ఏర్పాటు చేసిన అంబేడ్కర్ విగ్రహాన్ని ఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డితో కలిసి ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిమ్న వర్గాలు ఐక్యంగా ఉంటూ అభివృద్ధి సాధించాలని సూచించారు. ప్రతీ ఒక్కరూ అంబేడ్కర్ చూపిన దారిలో నడుస్తూ సమాజాభివృద్ధికి పాటుపడాలని పిలుపునిచ్చారు. ఎమెల్యే సంజీవరెడ్డి మాట్లాడుతూ.. బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి కాంగ్రెస్ పాటుపడిందన్నారు. పేదలకు సబ్సిడీపై ఇచ్చే బియ్యం నేడు దళారీలు కొనుగోలు చేసి మిల్లర్లకు విక్రయిస్తున్నారని ఆరోపించారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి, యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి రాకేష్ షెట్కార్, జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్ గుర్రపు మచ్చేందర్, రాష్ట్ర ఆత్మకమిటీ మాజీ డైరెక్టర్ మారుతి తదితరులు పాల్గొన్నారు.