
రాజ్యాంగంతో అన్ని వర్గాలకు లబ్ధి
జహీరాబాద్/న్యాల్‌కల్(జహీరాబాద్): రాజ్యాంగం ద్వారా కేవలం దళితులే కాదు అన్ని వర్గాల ప్రజలు లబ్ధి పొందుతున్నారని చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు. మండల పరిధిలోని గంగ్వార్ ప్రధాన చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని శనివారం జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్‌తో కలసి ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ...అట్టడుగు వర్గాల అభివృద్ధి కోసం అంబేడ్కర్ చేసిన కృషి చిరస్మరణీయమన్నారు. అంబేడ్కర్ వల్లే ఆర్‌బీఐ, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగాయన్నారు. తమ ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతోందని, ఎన్నడూ లేని విధంగా సీఎం రిలీఫ్ ఫండ్ కింద రూ.900కోట్ల నిధులను పేదలకు అందజేసిందని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద ఇండ్లకు నిధులను అందజేస్తున్నట్లు తెలిపారు. రూ.13వేల కోట్లతో పేదలకు సన్నబియ్యం పథకాన్ని అమలు చేస్తోందన్నారు.
బీజేపీ మతతత్వ పార్టీ: ఎంపీ సురేశ్ షెట్కార్
బీజేపీ మతతత్వ పార్టీ అని, దేశ రాజ్యాంగాన్ని మార్చేందుకు ప్రయత్నిస్తుందని జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్ ఆరోపించారు. నిమ్జ్ ఏర్పాటు వల్ల జహీరాబాద్ ముఖచిత్రం మారిపోతుందన్నారు. డాక్టర్ వెన్నెల గద్దర్ మాట్లాడుతూ...రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో జై బాపు, జై సంవిధాన్ కార్యక్రమం మొదలైందని అందులో అందరూ భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఐడీసీ మాజీ చైర్మన్ తన్వీర్, నియోజకవర్గ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అస్మా తబస్సుమ్, కాంగ్రెస్ నాయకులు మహమ్మద్ తన్వీర్, భాస్కర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ తిరుపతిరెడ్డి, పీఏసీఎస్ చైర్మెన్ సిద్దిలింగయ్యస్వామి, దళిత సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
అంబేడ్కర్ విగ్రహావిష్కరణలో ఎమ్మెల్యే వివేక్