ముంచెత్తుతున్న మురుగు | - | Sakshi
Sakshi News home page

ముంచెత్తుతున్న మురుగు

Published Fri, Jan 31 2025 8:03 AM | Last Updated on Fri, Jan 31 2025 8:03 AM

ముంచె

ముంచెత్తుతున్న మురుగు

గజ్వేల్‌–ప్రజ్ఞాపూర్‌ మున్సిపాలిటీని మురుగురహితంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా నిర్మించిన యూజీడీ (అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ) పనుల్లో నాణ్యతాలోపం శాపంగా మారింది. పలు కాలనీల్లో పైప్‌లైన్లు, చాంబర్ల ధ్వంసమవడం, లీకేజీల కారణంగా జనావాసాల్లో మురుగు నీరు పారుతోంది. ఫలితంగా దుర్గంధం వ్యాపిస్తోంది. రూ.155 కోట్లు వెచ్చించి యూజీడీ నిర్మించిన కొన్నాళ్లకే అధ్వానంగా మారడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

గజ్వేల్‌: మున్సిపాలిటీ పరిధిలోని గజ్వేల్‌, ప్రజ్ఞాపూర్‌లలో 2020 జూన్‌ నెలలో 138 కిలోమీటర్ల మేర భూగర్భ మురుగునీటి పైప్‌లైన్‌ వ్యవస్థతో పాటు నాలుగు చోట్ల ఎస్‌టీపీ (సేవరేజీ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌)ల నిర్మాణం చేపట్టారు. మొదట్లో విడుదలైన రూ.99కోట్లతో పనులతో పూర్తి కాక అంచనాలు అమాంతంగా పెంచారు. నిజానికి ముందున్న ప్రతిపాదనల్లో 138కిలోమీటర్ల పైప్‌లైన్‌ విస్తరణ పనులు చేపట్టాల్సి ఉండగా.. కేవలం 99కిలోమీటర్ల పైప్‌లైన్‌ విస్తరణకే నిధులు సరిపోయాయని, పట్టణంలో ఇంకా పనులు చేపట్టాల్సిన కాలనీలు ఉన్నాయని, వీటిల్లో అంతర్గత పైప్‌లైన్లను నిర్మించాల్సి ఉన్నదని చెబుతూ అంచనా వ్యయం పెంచి అదనంగా రూ.56కోట్ల నిధులు తెప్పించారు. మొత్తం వ్యయం రూ.155కోట్లకు చేరింది. ఈ నిధులతో 99కిలోమీటర్ల నుంచి 130కిలోమీటర్లకుపైగా పైప్‌లైన్‌ పనులు పూర్తి చేశామని అధికారులు చెబుతున్నారు.

పనులు లోపభూయిష్టం..

యూజీడీ పనులు లోపభూయిష్టంగా సాగటం వల్ల పలు కాలనీల్లో నిర్మించిన పైప్‌లైన్లకు లీకేజీలు ఏర్పడ్డాయి. మరోవైపు కొన్ని చోట్ల చాంబర్ల ధ్వంసమయ్యాయి. ఫలితంగా జనావాసాల్లోకి మురుగునీరు పారుతోంది. ప్రధానంగా పట్టణంలోని వైష్ణవీ గార్డెన్స్‌ సమీపంలోని లక్ష్మీప్రసన్ననగర్‌ కాలనీలో ఈ పరిస్థితి నెలకొన్నది. నెలల తరబడి ఇదే పరిస్థితి కొనసాగుతున్నా.. పట్టించుకునే నాథుడే కరువయ్యారు. ఇక్కడే కాదు.. పట్టణంలోని పలు కాలనీల్లో ఈ పరిస్థితి కనిపిస్తున్నది. పట్టణంలో మూడున్నరేళ్లకుపైగా సాగిన ఈ పనుల్లో అడుగడుగునా నాణ్యతా ప్రమాణాలు లోపించడమే ఈ దుస్థితికి కారణం. పనులను పర్యవేక్షించాల్సిన అధికార యంత్రాంగం పట్టింపులేనితనం, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం అన్నీ కలిసి యూజీడీ పనులు ఇష్టారాజ్యంగా సాగటానికి కారణమయ్యాయి. ఇకపోతే ఎక్కడైనా యాజీడీ చాంబర్ల నిండితే..వాటిని క్లియర్‌ చేయాల్సిన జెట్టింగ్‌ యంత్రాలు అందుబాటులో ఉండాల్సి ఉండగా, ఇప్పటివరకు ఈ యంత్రాల జాడే లేదు. దీనివల్ల చాంబర్లను సకాలంలో క్లియర్‌ చేయక దుర్గంధం వ్యాపిస్తోంది.

యూజీడీ.. లీకేజీ

రూ.155కోట్లు వెచ్చించినా వీడని కంపు నాణ్యతాప్రమాణాలకు మంగళం పలు కాలనీల్లో పైప్‌లైన్ల ధ్వంసం పనుల తీరుపై ఆది నుంచి విమర్శలే

మరమ్మతులు చేయిస్తాం

యూజీడీ లీకేజీలు, పైప్‌లైన్ల ధ్వంసంపై దృష్టి పెడతాం. క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి మరమ్మతులకు చర్యలు తీసుకుంటాం. పట్టణాన్ని మురుగు రహితంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకుసాగుతాం.

– గొల్కొండ నర్సయ్య,

గజ్వేల్‌–ప్రజ్ఞాపూర్‌ మున్సిపల్‌ కమిషనర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
ముంచెత్తుతున్న మురుగు1
1/1

ముంచెత్తుతున్న మురుగు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement