
భూ సేకరణ వేగిరం చేయండి
● కలెక్టర్ మిక్కిలినేని మనుచౌదరి ● రెవెన్యూ, సర్వే అధికారులతోకలెక్టర్ సమావేశం
సిద్దిపేటరూరల్: ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ వారికి కేటాయించిన భూ సేకరణ పనులు వేగిరం చేయాలని కలెక్టర్ మిక్కిలినేని మనుచౌదరి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో టీజీఐఐసీ, రెవెన్యూ సర్వే అధికారులతో అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్‌తో కలిసి కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో కేటాయించిన మండలాల్లో భూసేకరణ త్వరగా పూర్తి చేయాలన్నారు. భూసేకరణ పూర్తయిన వెంటనే కాంపౌండ్ ఏర్పాటు చేయాలన్నారు. టీజీఐఐసి, రెవెన్యూ, సర్వే అధికారుల సమన్వయంతో భూసేకరణ చేయాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓలు సదానందం, చంద్రకళ, టిజిఐఐసి జోనల్ మేనేజర్ అనురాధ, డీజిఎం ఉమామహేశ్వర్, డీఈ జ్యోతి, డీఎం మహేశ్వర్ , మండల తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.
నాణ్యమైన భోజనం అందించండి
చేర్యాల(సిద్దిపేట): విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని కలెక్టర్ మను చౌదరి అన్నారు. శుక్రవారం పట్టణ కేంద్రంలోని బాలుర గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాలను సందర్శించారు. ఈ సందర్భంగా వంట గది, సరుకులను పరిశీలించారు. నాణ్యమైన ఆహార పదార్థాలను మాత్రమే వండి విద్యార్థులకు వడ్డించాలని స్కూల్ ప్రిన్సిపాల్ పుల్లయ్యను ఆదేశించారు. గతంలో పదో తరగతి పరీక్షలో వచ్చిన ఉత్తీర్ణత శాతం వివరాలపై ఆరా తీశారు. అనంతరం మండల పరిధిలోని ముస్యాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లారు. ఏఎన్‌సీ, ఈడీడీ, ఓపీ, సిబ్బంది హాజరు రిజిస్టర్, ఆరోగ్య మహిళ తదితర రిజిస్టర్లను పరిశీలించారు. ఆరోగ్య మహిళా వైద్య పరీక్షలు షెడ్యూల్ ప్రకారం నిర్వహించాలని సూచించారు. అలాగే స్థానిక తహసీల్దార్ కార్యాలయానికి వచ్చిన కలెక్టర్... కార్యాలయం ఆవరణలో నిర్మిస్తున్న ఇందిరమ్మ నమూనా ఇంటి నిర్మాణపనులు పరిశీలించారు. త్వరగా నిర్మాణం పూర్తయ్యేలా చూడాలని తహసీల్దార్‌ను ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment