
ఉద్యాన పంటలకు ‘డ్రోన్’ దన్ను
గజ్వేల్: సాధారణ వ్యవసాయ పంటల్లో ఇప్పటికే డ్రోన్ల వినియోగం పెరిగింది. కూలీల కొరత ప్రధా న సమస్యగా మారగా డ్రోన్‌ల వినియోగం తరుణోపాయంగా మారుతోంది. ఎరువులు, పురుగు మందుల పిచికారీ సరైన పద్ధతిలో నిమిషాల్లో పూర్తి చేస్తున్నారు. దీనివల్ల అధిక దిగుబడులకు ఆస్కారం కలుగుతున్నది. ఇదే విధానం కొత్తగా ఉద్యాన పంటలైన పండ్లు, కూరగాయల తోటల సాగులో తీసుకొచ్చేందుకు హార్టికల్చర్ యూనివర్సిటీ అధికారులు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. ఇందుకోసం పలు కంపెనీలతో చర్చలు జరుపుతున్నారు. గత 10వ తేదీన యూనివర్సిటీలో డ్రోన్‌ల ఏర్పాటుపై కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, ఆర్‌టీఓ (రిమోట్ పైలెట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్) అధికారులతో చర్చలు జరిపారు. ఇందుకు సంబంధించి ఒక అవగాహన ఒప్పందం చేసుకోవాలని కూడా ప్రాథమికంగా నిర్ణయించారు. అంతకు ముందు కూడా ఇతర కంపెనీలతోనూ అధికారులు చర్చలు జరిపారు. త్వరలోనే ఇందుకు సంబంధించిన ఎంఓయూలు పూర్తికానున్నాయి.
ఉద్యాన పంటల్లో ప్రయోగాలు
కంపెనీలతో ఒప్పందాలు పూర్తయితే ఉద్యాన తోటలను ఎంచుకొని పంటల వారీగా ప్రయోగాలు చేయనున్నారు. పండ్ల తోటలు, కూరగాయల పంటల్లో అయిదారు రకాలు ఒకేసారి ఎంపిక చేసి ఆయా తోటల్లో డ్రోన్ ఆధారిత విధానం అమలు కోసం కచ్చితమైన పద్ధతులను నిర్ధారించడానికి స్టాండర్డ్ ఆపరేటీవ్ సిస్టమ్(ఎస్‌ఓపీ)ని అభివృద్ధి చేయనున్నారు. సాధారణ వ్యవసాయ పంటలతో పోలిస్తే ఉద్యాన పంటలు పూర్తిగా భిన్నం. కనుక తోటల్లో పురుగుమందులు, ఎరువులు కొమ్మకొమ్మకు పడే విధానం అభివృద్ధి చేయనున్నారు. ముఖ్యమైన విషయమేమిటంటే డ్రోన్‌ల వినియోగంపై రైతులకు శిక్షణ కూడా ఇవ్వనున్నారు. ఈ ప్రయోగాలను యూనివర్సిటీలోని డ్రోన్ సెంటర్ నుంచి నిరంతరం పర్యవేక్షిస్తుంటారు. రెండు, మూడు నెలల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయడానికి అధికారులు సన్నద్ధమవుతున్నారు.
దిగుబడులు పెంచుకునేందుకు అవకాశం పండ్లు, కూరగాయల తోటలకు తొలిసారిగా కొత్త విధానం ములుగు హార్టికల్చర్ యూనివర్సిటీ వేదికగా కార్యాచరణ
సాధారణ వ్యవసాయ పంటలకే పరిమితమైన డ్రోన్ విధానం...ఇక ఉద్యాన పంటల్లోనూ అందుబాటులోకి రాబోతున్నది.ములుగులోని కొండా లక్ష్మణ్ బాపూజీ హార్టికల్చర్ యూనివర్సిటీ వేదికగా కార్యాచరణ సిద్ధమవుతోంది. ఇందుకు సంబంధించి యూనివర్సిటీ అధికారులు పలు కంపెనీలతో ఎంఓయూలకు చర్చలు జరుపుతున్నారు.

ఉద్యాన పంటలకు ‘డ్రోన్’ దన్ను
Comments
Please login to add a commentAdd a comment