అక్కన్నపేట(హుస్నాబాద్): వేసవి కాలం దృష్ట్యా గ్రామాల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. హుస్నాబాద్‌లోని ఐడీఓసీ కార్యాలయంలో నియోజకవర్గ అభివృద్ధిపై మంత్రి సమీక్ష నిర్వహించారు. సమావేశంలో సిద్దిపేట, కరీంనగర్, హనుమకొండ మూడు జిల్లాల అదనపు కలెక్టర్లు, మండల అధికారులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామాల్లో మంచి నీటి సమస్యతో పాటు ఏ ఇతర సమస్యలు తలెత్తిన వెంటనే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. నీటి కొరత ఉన్న గ్రామాల్లో తాత్కాలిక బావులు, బోర్లను అద్దెకు తీసుకొని నీటిని అందించాలన్నారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ఇందిరమ్మ ఇళ్లు నియోజకవర్గానికి 3,500ఇళ్లు మంజూరయ్యాయని మంత్రి పొన్నం చెప్పారు. లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరగాలని అధికారులకు ఆదేశించారు. ఇల్లు లేని పేదలకు మొదటి ప్రాధాన్యత కల్పించాలన్నారు.
రూ.20లక్షలు మంజూరు
ఎల్కత్తురి మండలం దామర గ్రామంలో తాగునీటి ఇబ్బందులు ఉండడంతో ధర్మసాగర్ నుంచి దామర వరకు పైపులైన్ నిర్మాణానికి రూ.20లక్షలు తక్షణమే మంజూరు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. అదేవిధంగా తాగునీటి సమస్యలపై టోల్ ఫ్రీ నెంబర్‌కు కాల్ చేసి సమస్యపై ఫిర్యాదు చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉగాది నుంచి రేషన్ షాపుల ద్వారా ప్రతి పేదవాడికి సన్నబియ్యం ఇవ్వనున్నట్లు మంత్రి తెలిపారు. మీ సేవ, ప్రజా పాలన ద్వారా వచ్చిన దరఖాస్తుల్లో అర్హుల ఎంపిక పూర్తి చేయగానే రేషన్ కార్డులను పంపిణీ చేస్తామన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్, ఆర్డీఓ రామ్మూర్తి, అధికారులు పాల్గొన్నారు.
ముందస్తు చర్యలు
చేపట్టండి
పారదర్శకంగా
ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక
ఉగాది నుంచి
సన్నబియ్యం పంపిణీ
మంత్రి పొన్నం ప్రభాకర్
కాటమయ్య కిట్లతో రక్షణ
హుస్నాబాద్: తాటి చెట్లు ఎక్కే గీత కార్మికులకు కాటమయ్య కిట్లు రక్షణగా నిలుస్తున్నాయని మంత్రి పొన్నం అన్నారు. ఆదివారం పట్టణంలోని తిరుమల గార్డెన్‌లో గీత కార్మికులకు కాటమయ్య రక్షణ కిట్లు పంపిణీ చేశారు. అంతకు ముందు పట్టణంలోని ఆర్యవైశ్య భవన్ ఏసీ కమ్యూనిటీ హాల్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మొదటి దశలో 10 వేలు, రెండో దశలో 10 వేలు కిట్లను పంపిణీ చేశామన్నారు. జూన్ తరువాత రాష్ట్రంలో 40 లక్షల తాటి వనాలు, 40 లక్షల ఈత మొక్కలను పెంచేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి జై బాపు, జై భీమ్, జై సంవిధాన్‌పై అవగాహన కల్పించారు.