
కళలు, సంప్రదాయాలను ప్రోత్సహిద్దాం
● రుక్మాభట్ల గేయ రామాయణం అద్భుతం ● ఎమ్మెల్యే హరీశ్‌రావు
సిద్దిపేటజోన్: కళలు, సంప్రదాయాలను ప్రోత్సహించి, భవిష్యత్ తరాలకు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. ఆదివారం రాత్రి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రామలీల గేయ రామాయణ వాగ్గేయకారుడు రుక్మాభట్ల నరసింహా స్వామిని శ్రీరామనవమి సందర్భంగా ఎమ్మెల్యే సన్మానించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ రుక్మాభట్ల గేయ రామాయణం రచించి తన జీవితాన్ని శ్రీరాముడికి అంకితం చేశారని కొనియాడారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉగాది పురస్కారం తీసుకున్న రుక్మాభట్లకు పద్మశ్రీ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. నేటి సమాజంలో సాంకేతిక పరిజ్ఞానం పెరిగి పాత తరం వాళ్ళను చిన్నచూపు చూస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. సిద్దిపేట ఎందరో గొప్ప వారిని అందించిందని కళలకు కాణాచిగా అభివర్ణించారు. ఆధునిక యుగంలో మరుగున పడిపోయిన కళలు, సంప్రదాయాలను ప్రజలకు అందుబాటులోకి తేవాలన్నారు. ఈ సందర్భంగా రుక్మాబాట్ల గేయ రామాయణ గానం చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ ఫారూఖ్, జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ రోజాశర్మ పాల్గొన్నారు.
అన్నదాతలకు ఇబ్బందులు రావొద్దు
సిద్దిపేటజోన్: నియోజకవర్గ పరిధిలోని అన్నదాతలకు ఎలాంటి సమస్యలు రాకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే హరీశ్ రావు సూచించారు. ఆదివారం రాత్రి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఐకేపీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గంలో వడ్ల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల వద్ద ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు.
భూ సేకరణకు ఒక్క పైసా ఇవ్వలే
చిన్నకోడూరు(సిద్దిపేట): జిల్లాలోని ప్రాజెక్టుల కింద చిన్న కాలువల కోసం భూ సేకరణకు ప్రభుత్వం ఒక్క పైసా విడుదల చేయలేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌రావు ఆరోపించారు. ఆదివారం మండల పరిధిలోని చౌడారం మీదుగా బిక్కబండకు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేవలం భూసేకరణ చేసి కాలువలు తవ్వి రైతులకు నీళ్లు ఇవ్వడానికే కాంగ్రెస్ ప్రభుత్వానికి చేతకావడం లేదన్నారు. ఎడాదిన్నర కాలంలో ఒక్క ఎకరా కూడా ప్రాజెక్టుల కింద భూసేకరణ చేయలేదన్నారు. కాళేశ్వరం ద్వారా సిద్దిపేట నియోజకవర్గంలో 52 వేల ఎకరాలకు నీళ్లు అందిస్తున్నామన్నారు. ఇది కేసీఆర్ ఘనత అన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మాణిక్యరెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

కళలు, సంప్రదాయాలను ప్రోత్సహిద్దాం