పకోడీలు, బజ్జీలు తెలుసు. కాని ఉల్లిపాయను తామరపువ్వులా ఒలిచి శనగపిండిలో కలిపి నూనెలో వేయించి ఉల్లి పుష్పంగా తయారు చేసి సర్వ్ చేస్తే 11 లక్షల వ్యూస్ లొట్టలేశాయి. వడోదర స్ట్రీట్‌ఫుడ్‌లో తాజా హల్‌చల్ ఇది.
స్ట్రీట్‌ఫుడ్ ఎంత నోరూరించేదిగా ఉన్నా శుభ్రత పాటించరనే కంప్లయింట్‌తో కొందరు తినరు. కాని వడోదరలోని ఈ తాజా చిరుతిండి హల్‌చల్ చేయడమే కాక అందరి మన్ననా పొందింది. ‘చేస్తే ఇంత శుభ్రంగా చేయాలి’ అనే మెచ్చుకోలు అందుకుంది. వడోదర (గుజరాత్)లోని ఇద్దరు వ్యక్తులు ప్రత్యేకమైన స్టాల్ పెట్టి ఈ ‘ఉల్లి పుష్పం’ (ఉల్లి బజ్జీ) అమ్ముతున్నారు. ఇందుకు పెద్దసైజు ఉల్లిగడ్డలను వాడుతున్నారు. వాటిని పువ్వులా కట్ చేసే మిషన్‌ను తయారు చేయించుకున్నారు.
శుభ్రంగా వొలిచిన ఉల్లిపాయను ఈ మిషన్ కింద పెడితే పువ్వులా రెక్కలు వచ్చేలా కట్ చేస్తుంది. దానిని శనగపిండిలో ముంచి వేడి వేడి నూనెలో వేయిస్తే ఉల్లిపువ్వు ఆకారంలో బజ్జీలు తయారవుతున్నాయి. ఇవి చూడటానికి ఆకర్షణీయంగా ఉండటంతో జనం ఎగబడుతున్నారు. అంతే కాదు చేస్తున్న పద్ధతి శుభ్రంగా ఉండటంతో సంకోచం లేకుండా తింటున్నారు.
ఒక వ్లోగర్ ఈ ఉల్లిపువ్వు బజ్జీ తయారీని వీడియో తీసి ఇన్‌స్టాలో పెడితే క్షణాల్లో 11 లక్షల వ్యూస్ వచ్చాయి. ‘కొత్త కొత్త ఆలోచనలే వ్యాపారాన్ని నిలబెడతాయి’ అంటున్నారు. అందరి దగ్గరా ఉల్లిపాయలు ఉంటాయి. అందరూ బజ్జీలు వేస్తారు. కాని ‘ఉల్లిపువ్వు బజ్జీ’ అనే ఐడియా వీరికే వచ్చింది. ఆ ‘ఎక్స్’ ఫ్యాక్టర్ ఉన్నవాళ్లనే విజయం వరిస్తుంది. కొత్తగా ఆలోచించండి... పెద్ద విజయం సాధించండి... అని ఈ ఉల్లిపువ్వు కరకరలాడుతూ సందేశం ఇస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment