టీ20 ప్రపంచకప్ 2022లో వార్మప్ మ్యాచ్‌లు ఆడేందుకు టీమిండియా నిన్ననే బ్రిస్బేన్‌కు చేరుకుంది. కెప్టెన్ రోహిత్ శర్మ సహా భారత ఆటగాళ్లంతా వాకా మైదానంలో కఠోరంగా సాధన చేశారు. టీమిండియా ఇవాళ నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తుండగా ఓ ఆసక్తికర సన్నివేశం అందరి దృష్టిని ఆకర్శించింది. కెప్టెన్ రోహిత్ శర్మ ఓ కుర్రాడితో ముచ్చటిస్తూ కనిపించాడు. అంతేకాకుండా ఆ కుర్రాడితో బౌలింగ్ చేయించుకుని మరీ ప్రాక్టీస్ చేశాడు. ఇంతకీ ఎవరా కుర్రాడు.. హిట్‌మ్యాన్ దృష్టి ఎందుకు ఆ అబ్బాయిపై ప్రత్యేకంగా పడింది..? వివరాల్లోకి వెళితే..
వాకా మైదానంలో టీమిండియా ఓ పక్క నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తుండగా, మరో పక్క స్థానికంగా ఉండే కుర్రాళ్లు క్రికెట్ ఆడుకుంటున్నారు. ఆ గుంపులో దృశీల్ చౌహాన్ అనే 11 ఏళ్ల కుర్రాడు రోహిత్ శర్మ దృష్టిని ప్రత్యేకంగా ఆకర్శించాడు. ఆస్ట్రేలియాలో స్థిరపడిన భారత సంతతికి చెందిన దృశీల్ బౌలింగ్ స్టయిల్ హిట్‌మ్యాన్‌కు తెగ నచ్చేసింది. దీంతో వెంటనే ఆ కుర్రాన్ని పిలిపించుకుని, నెట్స్‌లో తనకు బౌలింగ్ చేయవల్సిందిగా కోరాడు.
లెఫ్ట్ ఆర్మ్ పేస్ బౌలర్ అయిన ఆ కుర్రాడు సింపుల్ రన్‌అప్‌తో బౌలింగ్ చేసిన తీరుకు రోహిత్ ఫిదా అయిపోయాడు. ముఖ్యంగా ఆ కుర్రాడు సంధించిన ఇన్‌స్వింగింగ్ యార్కర్లకు, ఔట్ స్వింగర్లకు తన వద్ద సమాధానం లేదన్నట్టుగా రోహిత్ ఎక్స్‌ప్రెషన్ పెట్టాడు. ఇలా కాసేపు ఆ కుర్రాడి బౌలింగ్‌ను ఎదుర్కొన్న హిట్‌మ్యాన్.. ఆ తర్వాత అతన్ని డ్రెస్సింగ్ రూమ్‌కు తీసుకెళ్లాడు. సహచరులకు దృశీల్‌ను పరిచయం చేశాడు. తాను ఆటోగ్రాఫ్ చేసిన కొన్ని ఫొటోలను గిఫ్ట్‌గా ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది. అద్భుతంగా బౌలింగ్ చేసినందుకు దృశీల్‌ను.. కుర్ర బౌలర్‌ను ఎంకరేజ్ చేసినందుకు హిట్‌మ్యాన్‌ను నెటిజన్లు అభినందిస్తున్నారు.
ఇదిలా ఉంటే, ఇవాళే మొదలైన టీ20 వరల్డ్‌కప్‌కు అదిరిపోయే ఆరంభం లభించింది. ఇవాళ జరిగిన రెండు క్వాలిఫయర్ మ్యాచ్‌లు అభిమానులను తెగ ఆకట్టుకున్నాయి. ఓపెనింగ్ మ్యాచ్‌లో పసికూన నమీబియా.. ఆసియా ఛాంపియన్ శ్రీలంకపై సంచలన విజయం సాధించగా.. ఆఖరి నిమిషం వరకు నువ్వా నేనా అన్నట్లు సాగిన రెండో క్వాలిఫయర్ మ్యాచ్‌లో యూఏఈని నెదర్లాండ్స్‌ను ఖంగుతినిపించింది. ఇక వార్మప్ మ్యాచ్‌ల విషయానికొస్తే.. టీమిండియా రేపు ఆస్ట్రేలియాతో, 19న న్యూజిలాండ్‌తో తలపడనుంది. అనంతరం సూపర్-12లో భాగంగా ఈనెల 23న చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్‌ను ఢీకొట్టనుంది.
Comments
Please login to add a commentAdd a comment