టీమిండియా జెర్సీలో రిషభ్ పంత్ (PC: Rishabh Pant Insta)
IPL 2024- Rishabh Pant Opens Up On Near-Fatal Car Crash: టీమిండియాలో అడుగుపెట్టిన అనతికాలంలోనే అద్భుతమైన ఆట తీరుతో అభిమానుల మనసు గెలిచాడు రిషభ్ పంత్. దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని వారసుడిగానూ నీరాజనాలు అందుకున్నాడీ ఉత్తరాఖండ్ వికెట్ కీపర్ బ్యాటర్.
ముఖ్యంగా టెస్టు ఫార్మాట్లో ఎన్నో చిరస్మరణీయ విజయాల్లో కీలక పాత్ర పోషించి భవిష్యత్ ఆశాకిరణంగా ప్రశంసలు అందుకున్నాడు. అయితే, 2022, డిసెంబరులో జరిగిన కారు ప్రమాదం పంత్ ప్రాణాల మీదకు తెచ్చింది.
కొత్త సంవత్సర వేడుకల కోసం వెళ్తున్న క్రమంలో రూర్కీ సమీపంలో పంత్ ప్రయాణిస్తున్న కారు డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో అతడు తీవ్ర గాయాలపాలయ్యాడు. ఆ సమయంలో కారులో పంత్ ఒక్కడే ఉండటం గమనార్హం.
పరిస్థితి చేయిదాటిపోయేదే!
అయితే, సమీపంలో ఉన్న కొంతమంది వ్యక్తులు సత్వరమే స్పందించి స్థానిక ఆస్పత్రికి తరలించడంతో అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డాడు పంత్. ఆస్పత్రికి తీసుకువెళ్లడం కొంచెం ఆలస్యమైనా పరిస్థితి చేయిదాటిపోయేదే!
ఆ తర్వాత అతడిని మంబైకి ఎయిర్‌లిఫ్ట్ చేసిన భారత క్రికెట్ నియంత్రణ మండలి అత్యున్నతస్థాయి చికిత్స అందించడంతో పంత్ క్రమక్రమంగా కోలుకున్నాడు. ప్రస్తుతం.. బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో పునరావాసం పొందుతున్న రిషభ్ పంత్.. ఫిట్‌నెస్ సాధించడంపై దృష్టి సారించాడు.
త్వరలోనే రీఎంట్రీ
త్వరలోనే తిరిగి మైదానంలో అడుగుపెట్టాలని.. ఐపీఎల్-2024తో పునరాగమనం చేయాలని పట్టుదలగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా స్టార్ స్పోర్ట్స్ షో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఘోర ప్రమాదం బారిన పడిన సమయంలో తన మనసులో చెలరేగిన అలజడి గురించి పంత్ పంచుకున్నాడు. ‘‘తొలిసారిగా... ఈ ప్రపంచంతో నా బంధం ముగిసిపోయిందని అనిపించింది.
ఇక బతకననే అనుకున్నా. యాక్సిడెంట్ జరిగిన సమయంలో గాయాల తీవ్రత గురించి నాకు తెలుస్తూనే ఉంది. అయితే, అవి మరింత తీవ్రం కాకపోవడం నా అదృష్టమనే చెప్పాలి. ఎవరో తెలియని వ్యక్తి నా ప్రాణాలను రక్షించారనే భావన కలిగింది.
త్వరగా కోలుకోవాలని సంకల్పించుకున్నా
ఆస్పత్రిలో ఉన్న సమయంలో.. నేను ఎప్పుడు కోలుకుంటానని డాక్టర్‌ను తరచూ అడిగేవాడిని. 16- 18 నెలల కాలం పడుతుందని ఆయన చెప్పారు. అయితే, వీలైనంత త్వరగా కోలుకోవాలని నేను అప్పుడే సంకల్పించుకున్నాను’’ అని రిషభ్ పంత్ చెప్పుకొచ్చాడు. కాగా ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు రిషభ్ పంత్.
చదవండి: సర్ఫరాజ్ నిరీక్షణకు తెర.. ఎట్టకేలకు టీమిండియాలో చోటు
Comments
Please login to add a commentAdd a comment