సౌతాంప్టన్ : విజయం ఖాయమనుకున్న మ్యాచ్‌ను చేతులారా ప్రత్యర్థికి అప్పగించిన జట్టు ఒక వైపు... ఓటమి వైపు సాగుతున్న దశనుంచి గెలుపును అంది పుచ్చుకున్న జట్టు మరో వైపు... ఈ సారి జరగబోయే సమరంలో ఎవరిది పైచేయి కానుంది. గత మ్యాచ్‌లాగే పోరు హోరాహోరీగా సాగుతుందా లేదా ఏకపక్షమా... వీటన్నింటికి రోజ్‌బౌల్ మైదానంలో సమాధానం లభించనుంది. ఇంగ్లండ్, పాకిస్తాన్ మధ్య మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా నేటినుంచి ఇక్కడ రెండో టెస్టు జరుగుతుంది. తొలి టెస్టులో నెగ్గిన ఇంగ్లండ్ 1–0తో ఆధిక్యంలో ఉండగా...ఈ మ్యాచ్ కూడా గెలిస్తే వరుసగా రెండో సిరీస్ ఆ జట్టు ఖాతాలో చేరుతుంది. మరో వైపు గత అనుభవంతో ఈ సారైనా మెరుగ్గా ఆడి సిరీస్ సమం చేయాలని పాకిస్తాన్ భావిస్తోంది.
స్టోక్స్ లేకుండానే...
ఒక మార్పు మినహా తొలి టెస్టులో విజయం సాధించిన తుది జట్టునే ఇంగ్లండ్ కొనసాగించే అవకాశం ఉంది. స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ వ్యక్తిగత కారణాలతో ఈ టెస్టుకు దూరమయ్యాడు. అతని స్థానంలో బ్యాట్స్‌మన్ జాక్ క్రాలీ జట్టులోకి వచ్చాడు. తుది జట్టులో మూడో స్థానంలో ఆడేందుకు క్రాలీకి అవకాశం లభిస్తే రూట్ నాలుగో స్థానంలో బరిలోకి దిగుతాడు. స్టోక్స్ ఎలాగూ తొలి టెస్టులో పూర్తి స్థాయి బ్యాట్స్‌మన్‌గానే ఆడాడు. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రమే అతను నాలుగు ఓవర్లు బౌలింగ్ చేశాడు. వుడ్ గాయంనుంచి కోలుకోలేదు కాబట్టి అండర్సన్, ఆర్చర్, బ్రాడ్ కొనసాగడం ఖాయమైంది. ఈ మ్యాచ్‌కు సంబంధించి ఇంగ్లండ్ ప్రధానంగా తమ బ్యాటింగ్‌పై దృష్టి పెట్టాల్సి ఉంది.
అదృష్టవశాత్తూ గత టెస్టు నెగ్గినా జట్టు బ్యాటింగ్ పేలవంగా ఉంది. రెండు ఇన్నింగ్స్‌లలోనూ ప్రధాన బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు. కెప్టెన్ రూట్ భారీ ఇన్నింగ్స్ ఆడి చాలా కాలమైంది. స్టోక్స్ లేని లోటు కచ్చితంగా కనిపిస్తుంది కాబట్టి ఇతర బ్యాట్స్‌మెన్‌పై బాధ్యత పెరిగింది. వోక్స్, బట్లర్ తమ విలువను గత మ్యాచ్‌లో చూపించారు. అయితే అన్నింటికి మించి అండర్సన్ ఫామ్‌పై జట్టు ఆందోళనతో ఉంది. తొలి టెస్టులో అతను 97 పరుగులిచ్చి ఒకే ఒక వికెట్ తీశాడు. అంతకు ముందు విండీస్‌తో కూడా అతను విఫలమయ్యాడు. అండర్సన్ చెలరేగితే ఇంగ్లండ్‌కు తిరుగుండదు.
ఆదుకునేవారేరీ...
గత కొన్నేళ్లలో పాకిస్తాన్ జట్టు గెలిచిన కొన్ని మ్యాచ్‌లు కూడా బౌలింగ్ బలగంతో వచ్చినవే. తొలి టెస్టులో కూడా జట్టు బౌలర్లు అద్భుతంగా రాణించారు. కుర్ర పేసర్లు షాహిన్ అఫ్రిది, నసీమ్ షా, అబ్బాస్‌లను ఎదుర్కోవడం ఇంగ్లండ్ వల్ల కాలేదు. ఇప్పుడు కూడా వారు అదే జోరు ప్రదర్శించగలరని టీమ్ మేనేజ్‌మెంట్ నమ్ముతోంది. పిచ్ కూడా పేస్‌కు అనుకూలించే అవకాశం ఉంది కాబట్టి ఈ విభాగంలో పాక్‌కు తిరుగు లేదు. ప్రధాన స్పిన్నర్‌గా యాసిర్ షాకు చోటు ఖాయం కాగా... రెండో స్పిన్నర్‌గా ఆడిన షాదాబ్ ఖాన్ స్థానంలో అదనపు బ్యాట్స్‌మన్‌ను ఆడించాలని టీమ్ భావిస్తోంది. అదే జరిగితే ఫవాద్ ఆలమ్ లేదా సొహైల్ ఖాన్‌లలో ఒకరికి అవకాశం దక్కవచ్చు.
ఎవరు వచ్చినా పాక్ బ్యాటింగ్ ఎప్పుడూ బలహీనంగానే కనిపిస్తోంది. అదే ప్రత్యర్థికి వరంగా మారుతోంది. ఒక్క బ్యాట్స్‌మన్ కూడా నిలకడగా ఆడి జట్టును గెలిపించేలా కనిపించడం లేదు. షాన్ మసూద్ తొలి ఇన్నింగ్స్‌లో బాగా ఆడినా రెండో ఇన్నింగ్స్‌లో డకౌటయ్యాడు. టాప్ బ్యాట్స్‌మన్ బాబర్ ఆజమ్‌నుంచి అతని స్థాయికి తగ్గ భారీ ఇన్నింగ్స్ రావాల్సి ఉంది. టెస్టు స్పెషలిస్ట్‌లు అజహర్ అలీ, అసద్ షఫీఖ్ ఏమాత్రం ప్రభావం చూపలేకపోతున్నారు. నిజానికి మాంచెస్టర్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో మంచి అవకాశం ముందున్న దశలో పాక్ బ్యాట్స్‌మెన్ కొంతైనా సంయమనంతో ఆడి కనీసం 250 పరుగులు చేసినా మ్యాచ్ కచ్చితంగా గెలిచి ఉండేవారు. కానీ జట్టు 169 పరుగులకే కుప్పకూలి ఇంగ్లండ్‌కు అవకాశం ఇచ్చింది. చివరగా... అజహర్ అలీ కెప్టెన్సీకి ఈ మ్యాచ్ పరీక్ష కానుంది. గత మ్యాచ్‌లో విఫల వ్యూహాలతో విమర్శలు ఎదుర్కొన్న అజహర్... ఇక సిరీస్ కోల్పోతే కెప్టెన్సీని కూడా చేజార్చుకునే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment