బీస్ట్‌లా విరుచుకుపడటమే తెలుసు.. 57 ఏళ్ల వయసులోనూ! | 57 Year Old Legend Mike Tyson In His Prime Like A Beast, Latest Training Video Goes Viral - Sakshi
Sakshi News home page

Mike Tyson Training Video: బీస్ట్‌లా విరుచుకుపడటమే తెలుసు.. 57 ఏళ్ల వయసులోనూ!

Published Mon, Feb 19 2024 4:31 PM | Last Updated on Mon, Feb 19 2024 6:20 PM

57 Year Old Mike Tyson In His Prime Like A Beast latest training clip - Sakshi

వరల్డ్‌ హెవీ వెయిట్‌ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌.. రెండో రౌండ్‌.. 12 రౌండ్ల పాటు సాగాల్సిన పోరు.. అప్పటికి రెండు నిమిషాల ముప్పై ఐదు సెకన్ల పోరు మాత్రమే సాగింది. ఓ వైపు మొహమ్మద్‌ అలీనే ఓడించిన ధీరుడు ట్రెవర్‌ బెర్బిక్‌.. మరోవైపు 20 ఏళ్ల యువకుడు.

ఎవరు గెలిచి ఉంటారో అంచనా వేయండి. సాధారణంగా బాక్సింగ్‌ అభిమానులెవరైనా బెర్బిక్‌ పేరే చెబుతారు. కానీ.. అందరి అంచనాలు తలకిందులు చేస్తూ ఆ 20 ఏళ్ల యంగ్‌స్టర్‌ తన ఆగమనాన్ని చాటే పంచ్‌ విసిరాడు.

ఆ దెబ్బకు ప్రత్యర్థి నేలకూలాడు. తిరిగి లేచి నిలబడే ఓపిక అతడిలో లేకపోయింది. దీంతో రిఫరీ వచ్చి సదరు యువకుడిని విజేతగా ప్రకటించాడు. అలా తొలిసారి వరల్డ్‌ హెవీ వెయిట్‌ చాంపియన్‌షిప్‌ గెలిచిన ఆ సింహబలుడు మరెవరో కాదు.. మైక్‌ టైసన్‌!

అద్భుత విజయాలతో.. అదిరే పంచ్‌లతో ఐరన్‌ మైక్‌, కిడ్‌ డైనమైట్‌ అని అభిమానుల చేత ముద్దుగా పిలిపించుకున్న అమెరికా ప్రొఫెషనల్‌ బాక్సర్‌. 1966లో న్యూయార్క్‌ జన్మించిన మైక్‌ టైసన్‌.. తండ్రి ప్రేమలేక.. నిరాదరణకు గురికావడంతో వీధి గుండాలతో సావాసం చేశాడు. విచ్చలవిడిగా దొంగతనాలకు పాల్పడేవాడు.

అలా.. టీనేజ్‌లో ఉండగానే ఏకంగా 38 సార్లు అరెస్టైన టైసన్‌.. అక్కడి జైలర్‌ చలవతో బాకింగ్స్‌ వైపు అడుగులేశాడు. ఆ తర్వాత కస్‌ డి అమాటో అనే వ్యక్తి మార్గదర్శనంలో తనలోని ప్రతిభకు పదునుపెట్టి చాంపియన్‌గా ఎదిగాడు. బీస్ట్‌లా ప్రత్యర్థులపై విరుచుకుపడుతూ కెరీర్‌లో అత్యున్నత శిఖరాలకు చేరుకున్నాడు. రెండు దశాబ్దాలపాటు బాక్సింగ్‌ ప్రపంచాన్ని ఏలి.. అందరికీ ఫేవరెట్‌గా మారిపోయాడు.

అయితే, తనలోని చీకటి కోణాన్ని వదల్లేక.. అత్యాచారాలు, వివాహేతర సంబంధాలతో రచ్చకెక్కడం అతడి జీవితంపై మాయని మచ్చల్లా మిగిలిపోయాయి. ఇక బాక్సర్‌గానే నటుడిగానూ పలు అమెరికన్‌ టీవీ సిరీస్‌లో నటించిన మైక్‌ టైసన్‌.. తెలుగు సినిమా లైగర్‌లోనూ మెరిసిన విషయం గుర్తుండే ఉంటుంది!!

ఇక తన కెరీర్‌లో మొత్తంగా ఆరు వరల్డ్‌ హెవీ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌ టైటిల్స్‌ గెలిచిన మైక్‌ టైసన్‌..  57 ఏళ్ల వయసులోనూ తనలోని పస తగ్గలేదన్నట్లుగా పంచ్‌లు విసురుతున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోపై మీరూ ఓ లుక్కేయండి!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement