పాకిస్తాన్ మెన్స్ క్రికెట్ టీమ్ వైట్‌బాల్ హెడ్ కోచ్‌గా మాజీ పేసర్ ఆకిబ్ జావిద్ ఎంపికయ్యాడు. జావిద్ ఎంపిక టెంపరరీ బేసిస్ (తాత్కాలికం) మీద జరిగింది. జావిద్ వచ్చే ఏడాది స్వదేశంలో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ వరకు పదవిలో కొనసాగుతాడు. జావిద్ ప్రస్తుతం పాకిస్తాన్ జాతీయ జట్టు చీఫ్ సెలెక్టర్‌గానూ వ్యవహరిస్తున్నాడు.
కాగా, కొద్ది రోజుల కిందట గ్యారీ కిర్‌స్టన్ పాకిస్తాన్ వైట్ బాల్ కోచ్ పదవికి అర్దంతరంగా రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అప్పటినుంచి రెడ్‌బాల్ కోచ్ జేసన్ గిల్లెస్పీ పాక్ వైట్‌బాల్ కోచ్‌గానూ వ్యవహరిస్తున్నాడు. గిల్లెస్పీ ఆథ్వర్యంలో పాక్ ఆస్ట్రేలియాను వారి సొంతగడ్డపై వన్డే సిరీస్‌లో (2-1) ఓడించింది. అయితే పాక్ టీ20 సిరీస్‌ను మాత్రం 0-3 తేడాతో కోల్పోయింది.
గిల్లెస్పీకి ముందు పెర్మనెంట్ వైట్‌బాల్ కోచ్‌గా ఎంపికైన గ్యారీ కిర్‌స్టన్ బోర్డుతో విభేదాల కారణంగా ఒక్క వన్డేలో కూడా కోచ్‌గా పని చేయకుండా వైదొలిగాడు. పాక్ గత ఏడాది కాలంలో ఐదుగురు వైట్‌బాల్ కోచ్‌లను మార్చింది. పాక్ పెర్మనెంట్ వైట్‌బాల్ హెడ్ కోచ్ ఎంపిక ప్రక్రియ ఛాంపియన్స్ ట్రోఫీ పూర్తయ్యేలోగా ముగుస్తుందని పాక్ క్రికెట్ బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది.
ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు పాక్ బిజీ షెడ్యూల్ కలిగి ఉంది. జింబాబ్వేతో మూడు మ్యాచ్‌ల వన్డే, టీ20 సిరీస్‌లు ఆడాల్సి ఉంది. అలాగే మూడు మ్యాచ్‌ల వన్డే, టీ20 సిరీస్‌ల కోసం సౌతాఫ్రికాలో పర్యటించాల్సి ఉంది. అనంతరం పాక్ స్వదేశంలో న్యూజిలాండ్, సౌతాఫ్రికాలతో కలిసి ట్రయాంగులర్ సిరీస్‌లో పాల్గొనాల్సి ఉంది. ఈ సిరీస్‌లన్నిటికీ పాక్ హెడ్‌కోచ్‌గా ఆకిబ్ జావిద్ వ్యవహరించనున్నాడు.
కాగా, పాక్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 మధ్యలో జరుగనుంది. ఈ టోర్నీ నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. భద్రతా కారణాల రిత్యా భారత్ ఈ టోర్నీలో పాల్గొనదని తేల్చిచెప్పింది. దీంతో టోర్నీ ఆతిథ్య హక్కులను పాక్ నుంచి ఇతర దేశానికి మార్చాలని ఐసీసీ చూస్తుంది. ఛాంపియన్స్ ట్రోఫీని తటస్ఠ వేదికపై నిర్వహించాలన్న భారత ప్రతిపాదనకు పాక్ నో చెప్పడంతో ఐసీసీ పునరాలోచనలో పడింది.
Comments
Please login to add a commentAdd a comment