
దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు, మిస్టర్ 360 డిగ్రీస్ ప్లేయర్ ఏబీ డివిలియర్స్ ఇటీవల తనకు ఎదురైన ఓ క్లిష్ట ప్రశ్నకు ఆసక్తికర సమాధానం చెప్పాడు. పొట్టి క్రికెట్‌లో ఆల్‌టైమ్ గ్రేటెస్ట్ ప్లేయర్ ఎవరు అని ఏబీడీని ప్రశ్నించగా.. అతను తన ఆప్త మిత్రుడు విరాట్ కోహ్లి పేరు కానీ, ఆర్సీబీ మాజీ సహచరుడు, విధ్వంసకర ఆటగాడు, విండీస్ మాజీ ప్లేయర్ క్రిస్ గేల్ పేరు కానీ చెప్పకుండా ఎవరూ ఊహించని విధంగా ఆఫ్ఘన్ స్పిన్ సంచలనం రషీద్ ఖాన్ పేరు చెప్పి యావత్ క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేశాడు.
బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ మెరుపులు మెరిపించగల సత్తా ఉన్న రషీద్‌ను ఆల్‌టైమ్ గ్రేట్‌గా ప్రకటించడాన్ని సమర్ధించుకున్న ఏబీడీ.. రషీద్‌ను మ్యాచ్ విన్నర్‌గా పరిగణిస్తానని, మైదానంలో అతనో గర్జించే సింహమని కొనియాడాడు. రషీద్ ప్రతిసారి గెలవాలనుకుంటాడని, ఈ లక్షణమే అతన్ని ప్రపంచంలో అత్యుత్తమ ఆటగాడిగా నిలబెట్టిందని అన్నాడు. టీ20ల్లో రషీద్‌కు మించిన బెస్ట్ ఆల్‌రౌండన్‌ను చూడలేదని చెప్పిన ఏబీడీ.. పొట్టి ఫార్మాట్‌లో అతను ప్రదర్శించే గట్స్‌కు సలామ్ కొట్టాడు. సూపర్ స్పోర్ట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏబీడీ తన మనసులో మాటను బయటపెట్టాడు.
కాగా, రషీద్ ఖాన్.. 2017 ఐపీఎల్ సీజన్ ద్వారా వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఆ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహించిన రషీద్.. 14 మ్యాచ్‌ల్లో 17 వికెట్లు పడగొట్టి ప్రపంచ క్రికెట్ దృష్టిని ఆకర్శించాడు. 2017 నుంచి 2021 వరకు ఎస్‌ఆర్‌హెచ్‌కు ప్రాతినిధ్యం వహించిన రషీద్.. 5 ఎడిషన్లలో 93 వికెట్లు పడగొట్టాడు. గత సీజన్‌లో గుజరాత్ టైటాన్స్‌కు వలస వెళ్లిన రషీద్.. ఈ సీజన్ మొత్తంలో 19 వికెట్లు పడగొట్టి, ఆ జట్టు టైటిల్ సాధించడంలో కీలకపాత్ర పోషించాడు.
అంతర్జాతీయ టీ20ల్లో 77 మ్యాచ్‌ల్లో 126 వికెట్లు పడగొట్టిన రషీద్.. 92 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 112 వికెట్లు దక్కించుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో మూడో స్థానంలో ఉన్న రషీద్.. ఐపీఎల్‌తో పాటు ప్రపంచం నలుమూలల్లో జరిగే వివిధ లీగ్‌ల్లో పాల్గొంటాడు. అతను పీఎస్‌ఎల్‌లో లాహోర్ ఖలందర్స్ తరఫున, బిగ్ బాష్ లీగ్‌లో అడిలైడ్ స్ట్రయికర్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment