భారత మాజీ క్రికెటర్ అజయ్ జడేజా రాత్రికి రాత్రి అపర కుబేరుడైపోయాడు. జామ్‌నగర్ రాజ సింహాసనాన్ని వారసత్వంగా పొందిన తరువాత భారతదేశపు అత్యంత ధనిక క్రికెటర్‌గా అవతరించాడు. ఈ క్రమంలో భారత దేశపు అత్యంత సంపన్న క్రికెటర్ విరాట్ కోహి ఆస్తిని అధిగమించాడు. జడేజా నికర విలువ రూ. 1,450 కోట్లు కాగా.. కోహ్లి నికర విలువ రూ. 1,090 కోట్లుగా ఉంది.
కాగా, అక్టోబర్ 12న దసరా శుభ సందర్భంగా నవనగర్‌ను పాలిస్తున్న జామ్ సాహెబ్ మహారాజా శత్రుసల్యసింహ్‌జీ దిగ్విజయ్‌సింహ్‌జీ జడేజా తన వారసుడి గురించి ఒక ముఖ్యమైన ప్రకటన చేశారు. రాజకుటుంబంలో సుప్రసిద్ధ వ్యక్తి , భారత మాజీ క్రికెటర్ అజయ్ జడేజాను తన వారసుడిగా ప్రకటించారు. అజయ్ జడేజా.. మహారాజా శత్రుసల్యసింహ్‌జీ దిగ్విజయ్‌సిన్హ్‌జీ జడేజాకు స్వయానా మేనల్లుడు.
అజయ్ జడేజా వారుసుడిగా బాధ్యతలు చేపట్టిన జామ్‌నగర్ రాజకుటుంబానికి భారత క్రికెట్‌లో ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. దేశీవాళీ క్రికెట్‌లో నిర్వహించే రంజీ ట్రోఫీ, దులీప్ ట్రోఫీలకు వీరి కుటుంబసభ్యులైన K.S.రంజిత్‌సింహ్‌జీ, K.S. దులీప్‌సింహ్‌జీ పేర్లు పెట్టారు.
జడేజా క్రికెట్‌లో తన పూర్వీకుల వారసత్వాన్ని కొనసాగించాడు. 1992లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన అజయ్ జడేజా.. భారత్ జట్టు తరఫున 15 టెస్టులు, 196 వన్డేలు ఆడాడు. ఇందులో 6 సెంచరీలు, 34 హాఫ్ సెంచరీల సాయంతో దాదాపు 6000 పరుగులు చేశాడు. జడేజా వన్డేల్లో 20 వికెట్లు కూడా తీశాడు.
1996 వన్డే ప్రపంచకప్‌లో బెంగళూరు వేదికగా జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో పాక్‌పై జడేజా ఆడిన ఇన్నింగ్స్ సగటు క్రికెట్ అభిమానికి ఇప్పటికి గుర్తుండి ఉంటుంది. ఆ మ్యాచ్‌లో జడేజా కేవలం 25 బంతుల్లో 45 పరుగులు చేశాడు. అందులో 40 పరుగులు దిగ్గజ పేసర్ వకార్ యూనిస్ వేసిన చివరి రెండు ఓవర్లలో వచ్చినవే కావడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment