Ajit Agarkar Applies For Chief Selector Post After BCCI Promises Salary Hike - Sakshi
Sakshi News home page

కోటి కాదు.. ఇంకా పెంచుతాం : బీసీసీఐ హామీ.. గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన మాజీ పేసర్‌

Published Sat, Jul 1 2023 3:49 PM | Last Updated on Sat, Jul 1 2023 4:28 PM

Ajit Agarkar Applies For Chief Selector Job After BCCI Promises Salary Hike - Sakshi

భారత జట్టు

BCCI New Chief Selector: టీమిండియా క్రికెటర్‌ అజిత్‌ అగార్కర్‌ టీమిండియా చీఫ్‌ సెలక్టర్‌గా బాధ్యతలు చేపట్టడం దాదాపు ఖాయమైంది. త్వరలోనే ఇందుకు సంబంధించిన ప్రకటన వెలువడనుంది. వార్షిక వేతనం విషయంలో భారత క్రికెట్‌ నియంత్రణ మండలి ఇచ్చిన హామీ మేరకు ఈ మాజీ పేసర్‌ సెలక్షన్‌ కమిటీ చైర్మన్‌గా వ్యవహరించేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది.

చేతన్‌ శర్మ రాజీనామాతో
కాగా ఓ ప్రైవేట్‌ చానెల్‌ నిర్వహించిన స్టింగ్‌ ఆపరేషరన్‌ వల్ల టీమిండియా చీఫ్‌ సెలక్టర్‌గా ఉన్న చేతన్‌ శర్మ పదవి ఊడిన విషయం తెలిసిందే. భారత ఆటగాళ్లు ఫిట్‌నెస్‌ లేకపోయినా ఇంజక్షన్లు తీసుకుని బరిలో దిగుతారంటూ అతడు చేసిన వ్యాఖ్యలు పెనుదుమారం రేపాయి. దీంతో చేతన్‌ శర్మ రాజీనామా చేయాల్సి వచ్చింది.

సెహ్వా‍గ్‌ పేరు తెరపైకి! కొట్టిపడేసిన మాజీ ఓపెనర్‌
ఈ క్రమంలో భారత డాషింగ్‌ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ వంటి స్టార్లను చీఫ్‌ సెలక్టర్‌గా నియమించేందుకు బీసీసీఐ ప్రయత్నాలు చేసినట్లు వార్తలు వినిపించాయి. అయితే, ఇవన్నీ వట్టి పుకార్లేనంటూ వీరూ భాయ్‌ కొట్టివేశాడు. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌-2023 ఢిల్లీ క్యాపిటల్స్‌ కోచ్‌గా వ్యవహరించిన అజిత్‌ అగార్కర్‌ ఆ ఫ్రాంఛైజీతో బంధానికి వీడ్కోలు పలకడం చర్చకు దారి తీసింది.

కోటి చాలదు! వద్దే వద్దు!
బీసీసీఐ చీఫ్‌ సెలక్టర్‌ పదవి చేపట్టేందుకు అగార్కర్‌ తొలుత సంశయించినా బోర్డు మాత్రం అతడిని ఎట్టకేలకు ఒప్పించినట్లు తెలుస్తోంది. కాగా చీఫ్‌ సెలక్టర్‌కు ఏడాదికి కోటి రూపాయాలు వేతనంగా చెల్లిస్తోంది బీసీసీఐ. కమిటీలోని మిగతా సభ్యులకు వార్షిక వేతనంగా 90 లక్షలు అందజేస్తున్నట్లు సమాచారం.

ఇంకా పెంచుతాం.. బోర్డు హామీ
అయితే, జీతం విషయంలో అగార్కర్‌ వెనకడుగు వేయగా.. వేతనం పెంచేందుకు బోర్డు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కామెంటేటర్‌గా, కోచ్‌గా అగార్కర్‌ ఆర్జిస్తున్న మొత్తాన్ని భర్తీ చేసేలా హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అతడు గురువారం చీఫ్‌ సెలక్టర్‌ పదవికి దరఖాస్తు చేసుకున్నట్లు జాతీయ మీడియా వెల్లడించింది.

ఇందుకు సంబంధించి శనివారం (జూలై 1) ఇంటర్వ్యూ జరుగనుంది. ఆగష్టు 31 నుంచి ఆరంభం కానున్న ఆసియా కప్‌-2023 టోర్నీకి ముందు చీఫ్‌ సెలక్టర్‌గా అజిత్‌ అగార్కర్‌ నియామకం ఖరారు చేయనున్నట్లు తాజా సమాచారం. 

టీమిండియా తరఫున
ముంబైకి చెందిన 45 ఏళ్ల అగార్కర్‌ టీమిండియా తరఫున 26 టెస్టులు, 188 వన్డేలు, 3 టీ20లు ఆడాడు. అంతర్జాతీయ కెరీర్‌లో టెస్టుల్లో 58, వన్డేల్లో 288, టీ20లలో మూడు వికెట్లు పడగొట్టి విజయవంతమైన ఫాస్ట్‌ బౌలర్‌గా పేరొందాడు. ఇదిలా ఉంటే.. జూలై 12 నుంచి వెస్టిండీస్‌తో టీమిండియా టెస్టు సిరీస్‌ ప్రారంభం కానుంది. ఇందుకోసం ఇప్పటికే సెలక్షన్‌ కమిటీ జట్టును ప్రకటించింది.

చదవండి: ఎందుకిలా చేశావు ధోని భయ్యా! మిస్టర్‌ కూల్‌ ఆన్సర్‌తో దిమ్మతిరిగిపోయింది!
Ind Vs WI: టీమిండియా కొత్త స్పాన్సర్‌ ఇదే: బీసీసీఐ కీలక ప్రకటన

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement