ఈనెల 24 నుంచి రేసింగ్ షురూ
సాక్షి, హైదరాబాద్: తెలుగు సినీ హీరో అక్కినేని నాగ చైతన్య తనకు ఎంతో ఇష్టమైన రేసింగ్‌లోకి అడుగు పెట్టారు. ఇండియన్ రేసింగ్ లీగ్ (ఐఆర్‌ఎల్)లో పోటీపడే హైదరాబాద్ బ్లాక్‌బర్డ్స్ ఫ్రాంచైజీని కొనుగోలు చేయడంతో ఇండియన్ రేసింగ్ ఫెస్టివల్ (ఐఆర్‌ఎఫ్) ఆధ్వర్యంలో జరిగే ‘ఫార్ములా 4’లో భాగమయ్యాడు. ఈ సీజన్‌కు సంబంధించిన రేసులు ఈ నెల 24న మొదలవనున్నాయి.
యూత్ ఫాలోయింగ్ ఉన్న యువ హీరో నాగ చైతన్యకు ఫార్ములావన్ అంటే క్రేజీ! బుల్లెట్‌లా దూసుకెళ్లే ఈ కారు రేసింగ్‌ను కుదిరితే ప్రత్యక్షంగా లేదంటే పరోక్షంగా టీవీల్లో చూస్తుంటారు. ఈ ఆసక్తితోనే ఆయన సూపర్ కార్స్, కొత్తకొత్త హై రేంజ్ స్పీడ్ మోటార్ సైకిళ్లను కొని తన గ్యారేజీలో పెట్టుకుంటారు.సినీ ఇండస్ట్రీకి చెందిన అక్కినేని వారసుడు తమ రేసింగ్ లీగ్‌లో భాగం కావడంతో లీగ్‌పై ప్రేక్షకాదరణ కూడా అంతకంతకు పెరుగుతుందని నిర్వాహకులు హర్షం వ్యక్తం చేశారు.
నాగ చైతన్య మాట్లాడుతూ ‘నాకు చిన్నప్పటి నుంచే రేసింగ్ అంటే ఇష్టం. ఫార్ములావన్ అంటే పిచ్చి. హైస్పీడ్ డ్రామాను ఎంజాయ్ చేస్తాను. ఈ ఫార్ములావన్ క్రేజీతోనే నేను సూపర్ కార్స్, బైక్స్ కొనేలా చేశాయి. నాకు తెలిసి ఇండియన్ రేసింగ్ ఫెస్టివల్ కేవలం ఈవెంట్ మాత్రమే కాదు. అంతకు మించిన ఆడ్వెంచర్ కూడా! అందుకే నేను నా అభిరుచి ఉన్న రేసింగ్ క్రీడలో భాగమయ్యాను. హైదరాబాద్ బ్లాక్‌బర్డ్స్ టీమ్ మా అంచనాలకు అనుగుణంగా రేసింగ్‌లో దూసుకెళ్తుంది’ అని అన్నారు.
నిజానికి రేసింగ్ అంటే అక్కినేని ఇంటికి కొత్తేం కాదు. స్టార్ హీరో నాగార్జున కుమారుడు నాగ చైతన్య రేసింగ్ ప్రేమికుడైతే... ఆయన సోదరుడు ఆదిత్య (అక్కినేని వెంకట్ కుమారుడు) స్వయంగా రేసర్. కొన్నేళ్ల క్రితం ఆదిత్య మోటార్ రేసింగ్ ట్రాక్‌పై పలు రేసుల్లో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment