తొలిసారి ఫ్రెంచ్ ఓపెన్‌లో ఫైనల్లోకి
సెమీస్‌లో రెండో ర్యాంకర్ సినెర్‌పై గెలుపు
పారిస్: కెరీర్‌లో మూడో గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించడానికి స్పెయిన్ టెన్నిస్ స్టార్, ప్రపంచ మూడో ర్యాంకర్ కార్లోస్ అల్‌కరాజ్ విజయం దూరంలో నిలిచాడు. ఫ్రెంచ్ ఓపెన్‌లో అల్‌కరాజ్ తొలిసారి ఫైనల్లోకి దూసుకెళ్లాడు. వచ్చే వారం కొత్త ప్రపంచ నంబర్‌వన్‌గా అవతరించనున్న ప్రస్తుత రెండో ర్యాంకర్ యానిక్ సినెర్ (ఇటలీ)తో శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి సెమీఫైనల్లో అల్‌కరాజ్ 2–6, 6–3, 3–6, 6–4, 6–3తో గెలుపొందాడు.
నాలుగో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ), గత ఏడాది రన్నరప్ కాస్పర్ రూడ్ (నార్వే) మధ్య రెండో సెమీఫైనల్ విజేతతో ఆదివారం జరిగే ఫైనల్లో అల్‌కరాజ్ తలపడతాడు. 21 ఏళ్ల అల్‌కరాజ్ 2022లో యూఎస్ ఓపెన్, 2023లో వింబుల్డన్ టోర్నీర్నీలో విజేతగా నిలిచాడు. అడ్రియానో పనట్టా (1976లో) తర్వాత ఫ్రెంచ్ ఓపెన్‌లో ఫైనల్‌కు చేరిన తొలి ఇటలీ ప్లేయర్‌గా ఘనత వహించాలనుకున్న సినెర్‌కు నిరాశ ఎదురైంది.
4 గంటల 9 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో సినెర్ చివరి రెండు సెట్‌లలో అల్‌కరాజ్ ఆటకు ఎదురునిలువలేక ఓడిపోయాడు. 8 ఏస్‌లు, 7 డబుల్ ఫాల్ట్‌లు చేసిన అల్‌కరాజ్ 65 విన్నర్స్‌తో అదరగొట్టాడు. తన సర్విస్‌ను ఆరుసార్లు కోల్పోయిన ఈ మాజీ నంబర్‌వన్ ప్రత్యర్థి సర్విస్‌ను కూడా ఆరుసార్లు బ్రేక్ చేశాడు. 15 పాసింగ్, 23 డ్రాప్ షాట్‌లతో అలరించిన అల్‌కరాజ్ నెట్ వద్దకు 27 సార్లు దూసుకొచ్చి 16 సార్లు పాయింట్లు గెలిచాడు.
స్వియాటెక్ X జాస్మిన్
» నేడు మహిళల సింగిల్స్ ఫైనల్
» సాయంత్రం గం. 6:30 నుంచి సోనీ స్పోర్ట్స్‌లో
కెరీర్‌లో ఐదో గ్రాండ్‌స్లామ్ టైటిల్ లక్ష్యంగా స్వియాటెక్... తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించాలనే పట్టుదలతో జాస్మిన్ పావ్లిని... నేడు జరిగే ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో తలపడనున్నారు.
ప్రపంచ నంబర్‌వన్ స్వియాటెక్ (పోలాండ్) ఇప్పటికే ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌ను మూడుసార్లు (2020, 2022, 2023) చేజిక్కించుకోగా... 15వ ర్యాంకర్ జాస్మిన్ (ఇటలీ) మాత్రం కెరీర్‌లో 18వ గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆడుతూ తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఫైనల్‌కు చేరింది.
Comments
Please login to add a commentAdd a comment