ఆంధ్ర ఫాలోఆన్‌ | Andhra team fell in the follow on | Sakshi
Sakshi News home page

ఆంధ్ర ఫాలోఆన్‌

Published Mon, Oct 21 2024 3:15 AM | Last Updated on Mon, Oct 21 2024 3:15 AM

Andhra team fell in the follow on

రెండో ఇన్నింగ్స్‌లో 203/4

రాణించిన అభిషేక్, మహీప్‌

పోరాడుతున్న భరత్, విహారి 

అహ్మదాబాద్‌: రంజీ ట్రోఫీ క్రికెట్‌ టోర్నీలో భాగంగా మాజీ చాంంపియన్‌ గుజరాత్‌తో జరుగుతున్న గ్రూప్‌ ‘బి’ లీగ్‌ మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు ఫాలోఆన్‌లో పడింది. తొలి ఇన్నింగ్స్‌లో టాపార్డర్‌ వైఫల్యంతో తక్కువ స్కోరుకే ఆలౌటైన ఆంధ్ర జట్టు... రెండో ఇన్నింగ్స్‌లో మెరుగైన ప్రదర్శన కనబర్చింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతున్న ఈ పోరులో ఆదివారం ఆట ముగిసే సమయానికి ఆంధ్ర రెండో ఇన్నింగ్స్‌లో ఫాలోఆన్‌ ఆడుతూ 66 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. 

ఓపెనర్లు అభిషేక్‌ రెడ్డి (113 బంతుల్లో 81; 12 ఫోర్లు, 2 సిక్సర్లు), మహీప్‌ కుమార్‌ (55; 5 ఫోర్లు, ఒక సిక్సర్‌) అర్ధశతకాలతో సత్తా చాటారు. కెప్టెన్  రికీ భుయ్‌ (0), షేక్‌ రషీద్‌ (3) విఫలం కాగా... వికెట్‌ కీపర్‌ కోన శ్రీకర్‌ భరత్‌ (31 బ్యాటింగ్‌; ఒక ఫోర్, ఒక సిక్సర్‌), హనుమ విహారి (24 బ్యాటింగ్‌; 3 ఫోర్లు) పోరాడుతున్నారు. గుజరాత్‌ బౌలర్లలో టీమిండియా స్పిన్నర్‌ రవి బిష్ణోయ్‌ 3 వికెట్లు పడగొట్టాడు. 

అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 137/5తో మూడో రోజు తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఆంధ్ర జట్టు చివరకు 51.3 ఓవర్లలో 213 పరుగులకు ఆలౌటైంది. టాపార్డర్‌ చేతులెత్తేసిన చోట శ్రీకర్‌ భరత్‌ (96 బంతుల్లో 98; 15 ఫోర్లు, 2 సిక్సర్లు) ఎదురుదాడికి దిగి ఫలితం రాబట్టాడు. భారీ షాట్లతో చెలరేగిన భరత్‌ త్రుటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. 

ఇటీవల బంగ్లాదేశ్‌తో టి20 సిరీస్‌లో మెరుపులు మెరిపించిన నితీశ్‌ కుమార్‌ రెడ్డి (47; 7 ఫోర్లు, ఒక సిక్సర్‌), విజయ్‌ (36; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. గుజరాత్‌ బౌలర్లలో కెపె్టన్‌ చింతన్‌ గాజా 4 వికెట్లు పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో 154 పరుగుల ఆధిక్యం దక్కించుకున్న గుజరాత్‌ జట్టు ఆంధ్రను ఫాలోఆన్‌ ఆడించగా... రెండో ఇన్నింగ్స్‌లో టాపార్డర్‌ మెరుగైన ప్రదర్శన కనబర్చింది. నేడు ఆటకు ఆఖరి రోజు కాగా... చేతిలో 6 వికెట్లు ఉన్న ఆంధ్ర జట్టు 49 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. భరత్, విహారి క్రీజులో ఉన్నారు.  

స్కోరు వివరాలు 
గుజరాత్‌ తొలి ఇన్నింగ్స్‌ 367; ఆంధ్ర తొలి ఇన్నింగ్స్‌ 213; ఆంధ్ర రెండో ఇన్నింగ్స్‌: అభిషేక్‌ రెడ్డి (ఎల్బీ) రవి బిష్ణోయ్‌ 81; మహీప్‌ కుమార్‌ (బి) రవి బిష్ణోయ్‌ 55; రికీ భుయ్‌ (సి అండ్‌ బి) అర్జాన్‌ 0; షేక్‌ రషీద్‌ (ఎల్బీ) రవి బిష్ణోయ్‌ 3; శ్రీకర్‌ భరత్‌ (బ్యాటింగ్‌) 31; హనుమ విహారి (బ్యాటింగ్‌) 24; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (66 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి) 203. వికెట్ల పతనం: 1–130, 2–131, 3–138, 4–145, బౌలింగ్‌: చింతన్‌ గాజా 6–2–21–0; అర్జాన్‌ 11– 3–20–1; సిద్ధార్థ్‌ దేశాయ్‌ 22–4–55–0; రవి బిష్ణోయ్‌ 17–2–67–3; జయ్‌మీత్‌ పటేల్‌ 6–2–8–0; మనన్‌ హింగ్రాజియా 4–0–24–0.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement