
Asia Cup 2022 - How India Can Qualify Final: ఆసియా కప్-2022 టీ20 సూపర్-4 దశను టీమిండియా ఓటమితో ఆరంభించింది. దుబాయ్ వేదికగా ఆదివారం(సెప్టెంబరు 4) దాయాది పాకిస్తాన్‌తో పోరులో ఐదు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. దీంతో రోహిత్ సేన ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో ముందుకు వెళ్లాలంటే మిగిలిన రెండు మ్యాచ్‌లు కీలకంగా మారాయి. మరి ఫైనల్ రేసులో టీమిండియా నిలిచేందుకు అవసరమైన సమీకరణాలు ఏమిటో గమనిద్దాం.
అప్పుడు భారత్.. ఇప్పుడు పాకిస్తాన్
లీగ్ దశలో తమ మొదటి మ్యాచ్‌లో పాకిస్తాన్ భారత్ చేతిలో ఓడిపోయింది. ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా సిక్స్ బాదడంతో రోహిత్ సేన విజయం సాధించింది. చిరకాల ప్రత్యర్థిపై ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది.
అయితే, సూపర్-4 మొదటి మ్యాచ్‌లో సీన్ రివర్స్ అయింది. గత మ్యాచ్ తరహాలోనే ఆఖరి ఓవర్ వరకు నరాలు తెగే ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో గెలుపు పాక్‌ను వరించింది. యాధృచ్చికంగా టీమిండియా ఐదు వికెట్లు కోల్పోయి రెండు బంతులు మిగిలి ఉండగా విజయం సాధిస్తే.. పాకిస్తాన్ సైతం ఐదు వికెట్ల నష్టానికి ఒక బంతి మిగిలి ఉండగా గెలుపును సొంతం చేసుకుంది.
అందుకే మనకంటే మెరుగ్గా పాకిస్తాన్
ఇదిలా ఉంటే లీగ్ దశలో హాంగ్ కాంగ్‌తో మ్యాచ్‌లో భారత్ 40 పరుగుల తేడాతో గెలుపొందితే.. పాకిస్తాన్ ఏకంగా 155 పరుగుల తేడాతో పసికూనపై జయకేతనం ఎగురవేసింది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్(0.126).. టీమిండియా(-0.126) కంటే రన్‌రేట్ పరంగా మెరుగైన స్థితిలో ఉంది.
రెండేసి పాయింట్లతో శ్రీలంక, పాకిస్తాన్
ఆసియా కప్-2022 టీ20 టోర్నీ లీగ్ దశలో అఫ్గనిస్తాన్ చేతిలో పరాభవానికి శ్రీలంక.. సూపర్-4 తొలి మ్యాచ్‌లో బదులు తీర్చుకుంది. చివరి ఓవర్ మొదటి బంతి వరకు సాగిన మ్యాచ్‌లో నాలుగు వికెట్ల తేడాతో అఫ్గన్‌ను ఓడించి లంక విజయం సాధించింది. ఈ క్రమంలో రెండు పాయింట్లు సాధించి సూపర్-4 టాపర్‌గా ఉంది.
పాకిస్తాన్ సైతం టీమిండియాపై గెలుపుతో రెండు పాయింట్లు సాధించగా.. రన్‌రేటు పరంగా శ్రీలంక(0.589) పటిష్ట స్థితిలో ఉంది. ఇక ఇప్పటికే సూపర-4 దశలో ఒక్కో మ్యాచ్ ఓడిపోయిన టీమిండియా, అఫ్గనిస్తాన్ సున్నా పాయింట్లతో వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి.
ముందు దసున్ షనక బృందాన్ని, తర్వాత అఫ్గన్‌ను చిత్తు చేస్తేనే..
సూపర్-4 స్టేజ్‌లో టీమిండియా తమ తదుపరి మ్యాచ్‌ను శ్రీలంకతో ఆడనుంది. దుబాయ్ వేదికగా మంగళవారం(సెప్టెంబరు 6) రాత్రి ఏడున్నర గంటలకు ఇరు జట్ల మధ్య మ్యాచ్ ఆరంభం కానుంది.
ఆ తర్వాత సెప్టెంబరు 8(గురువారం)న భారత్- అఫ్గనిస్తాన్‌తో తలపడనుంది. ఒకవేళ ఈ రెండు మ్యాచ్‌లలో ఒక్కటి ఓడినా.. టీమిండియా ఇంటిబాట పట్టక తప్పదు. ఎందుకంటే శ్రీలంక, పాకిస్తాన్‌లు ఇప్పటికే ఒక్కో విజయంతో పటిష్ట స్థితిలో ఉన్నాయి. లంక టీమిండియాను ఓడించి, అఫ్గన్ మిగిలిన రెండు మ్యాచ్‌లలో ఓడితే చాలు నేరుగా ఫైనల్‌కు దూసుకెళ్తుంది.
ఇతర జట్ల పరిస్థితి?
ఇక పాకిస్తాన్.. అఫ్గనిస్తాన్ లేదంటే శ్రీలంకను ఓడిస్తే తుది పోరుకు అర్హత సాధిస్తుంది. అదే విధంగా.. ఒకవేళ శ్రీలంక, అఫ్గనిస్తాన్ జట్లను భారత్ ఓడించినట్లయితే.. ఫైనల్లో టీమిండియా- పాకిస్తాన్ పోరును మరోసారి వీక్షించే అవకాశం అభిమానులకు దక్కుతుంది. అలా కాకుండా.. ఏ రెండు ఇతర జట్లు వరుసగా భారీ విజయాలు నమోదు చేసినా.. టీమిండియా టోర్నీ నుంచి నిష్క్రమించక తప్పదు. ఇదిలా ఉంటే.. అఫ్గనిస్తాన్ సైతం భారత్, పాకిస్తాన్‌ను ఓడిస్తే ఫైనల్‌కు చేరుకునే అవకాశం ఉంటుంది.
చదవండి: Ind Vs Pak: కీలకమైన సమయంలో క్యాచ్ నేలపాలు.. అర్ష్‌దీప్‌పై మండిపడ్డ రోహిత్! వైరల్
Asia Cup 2022 - Ind Vs Pak: పంత్‌పై కోపంతో ఊగిపోయిన రోహిత్ శర్మ.. ఎందుకంటే..?
Comments
Please login to add a commentAdd a comment