20 ఏళ్ల శ్రీలంక యువ స్పిన్నర్ దునిత్ వెల్లలగే చరిత్ర సృష్టించాడు. లంక తరఫున వన్డేల్లో ఐదు వికెట్ల ఘనత సాధించిన అతి పిన్న వయస్కుడిగా రికార్డుల్లోకెక్కాడు. ఆసియా కప్-2023లో భాగంగా కొలొంబో వేదికగా టీమిండియాతో ఇవాళ (సెప్టెంబర్ 12) జరుగుతున్న సూపర్-4 మ్యాచ్‌లో దునిత్ ఈ ఘనత సాధించాడు. దునిత్ 20 ఏళ్ల 246 రోజుల్లో ఈ ఘనత సాధించగా.. దీనికి ముందు ఈ రికార్డు చరిత బుద్ధిక పేరిట ఉండేది.
బుద్ధిక 2001లో జింబాబ్వేపై 21 ఏళ్ల 65 రోజుల వయసులో 5 వికెట్ల ఘనత సాధించాడు. ఇతనికి ముందు తిసార పెరీరా (21 ఏళ్ల 141 రోజులు), ఉవైస్ కర్నైన్ (21 ఏళ్ల 233 రోజులు) లంక తరఫున పిన్న వయసులో ఐదు వికెట్ల ఘనత సాధించిన వారిలో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో దునిత్ (10-1-40-5) ఐదు వికెట్ల ఘనత సాధించి, టీమిండియా టాపార్డర్‌ను కకావికలం చేశాడు. ఇతన్ని ఎదుర్కొనేందుకు టీమిండియా దిగ్గజ బ్యాటర్లు నానా తంటాలు పడ్డారు.
దునిత్ సంధించిన బంతులకు సమాధానం లేక విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ లాంటి వారే చేతులెత్తేశారు. యువ కెరటం శుభ్‌మన్ గిల్, స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్, స్టార్ ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా కూడా వెల్లలగే మాయాజాలానికి చిక్క వికెట్లు సమర్పించుకున్నారు. బ్యాటింగ్ హేమహేమీలైన రోహిత్, గిల్, విరాట్, రాహుల్, హార్దిక్‌లను అంతుచిక్కని బంతులు వేసి ఔట్ చేసిన వెల్లలగేపై ప్రస్తుతం క్రికెట్ సర్కిల్స్‌లో ప్రశంసల వర్షం కురుస్తుంది.
దునిత్‌కు మరో స్పిన్నర్ మహీష్ తీక్షణ (8-0-29-4) కూడా తోడవ్వడంతో భారత్ 47 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 197 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ దశలో వర్షం ప్రారంభంకావడంతో మ్యాచ్‌కు అంతరాయం కలిగింది. రోహిత్ శర్మ (53), ఇషాన్ కిషన్ (33), కేఎల్ రాహుల్ (39), శుభ్‌మన్ గిల్ (19), విరాట్ కోహ్లి (3), హార్దిక్ (5), జడేజా (4), బుమ్రా (5), కుల్దీప్ (0) ఔట్ కాగా.. అక్షర్ (15), సిరాజ్ (2) క్రీజ్‌లో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment