ఏషియన్ గేమ్స్ 2023 పురుషుల క్రికెట్‌లో క్వార్టర్ ఫైనల్ బెర్త్‌లు ఖరారయ్యాయి. జట్ల సీడింగ్ ఆధారంగా భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ జట్లు నేరుగా క్వార్టర్స్‌కు చేరుకోగా.. క్వాలిఫయింగ్ పోటీల ద్వారా నేపాల్, హాంగ్‌కాంగ్, మలేషియా జట్లు ఫైనల్ 8కు చేరాయి.
టీమిండియా మ్యాచ్ ఎవరితో, ఎప్పుడంటే..?
ఈ పోటీల్లో టీమిండియా మ్యాచ్ రేపు జరుగనుంది. తొలి క్వార్టర్ ఫైనల్లో నేపాల్.. టీమిండియాతో తలపడుతుంది. భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ రేపు (అక్టోబర్ 3) ఉదయం 6:30 గంటలకు ప్రారంభమవుతుంది.
ఈ పోటీల్లో రుతురాజ్ గైక్వాడ్ నేతృత్వంలోని టీమిండియా హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతుండగా.. సంచలన ప్రదర్శనలతో ఆకట్టుకున్న నేపాల్ అండర్ డాగ్‌గా బరిలోకి దిగనుంది. నేపాల్ జట్టు సభ్యులు ఇటీవలే మంగోలియాపై పలు ప్రపంచ రికార్డులు నమోదు చేశారు. అంతర్జాతీయ టీ20ల్లో ఫాస్టెస్ట్ హండ్రెడ్, ఫాస్టెస్ట్ ఫిఫ్టి, అత్యధిక టీమ్ స్కోర్.. ఇలా ఈ మ్యాచ్‌లో పలు ప్రపంచ రికార్డులు బద్దలయ్యాయి.
మిగతా క్వార్టర్ ఫైనల్స్‌లో ఎవరెవరంటే..?
తొలి క్వార్టర్ ఫైనల్లో భారత్, నేపాల్ జట్లు తలపడనుండగా.. రెండో క్వార్టర్ ఫైనల్లో పాకిస్తాన్, హాంగ్‌కాంగ్ (అక్టోబర్ 3న ఉదయం 11:30 గంటలకు), మూడో క్వార్టర్ ఫైనల్లో శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ (అక్టోబర్ 4న ఉదయం 6:30 గంటలకు), నాలుగో క్వార్టర్ ఫైనల్లో బంగ్లాదేశ్, మలేషియా (అక్టోబర్ 4న ఉదయం 11:30 గంటలకు) జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్‌ల్లో విజేతలు అక్టోబర్ 6న జరిగే సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. అనంతరం అక్టోబర్ 7న స్వర్ణ పతకం కోసం ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment